వికారాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : నకిలీ పత్తి విత్తనాల దందా జిల్లా లో గుట్టు చప్పుడు కాకుండా యథేచ్ఛగా సాగుతున్నది. ప్రతి ఏటా కొడంగల్, తాం డూరు ప్రాంతాల్లో ఈ విత్తనాలు పట్టుపడుతున్నా అధికారులు నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. వ్యవసాయ, పోలీసుశాఖల అధికారులు మాత్రం తుతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జిల్లాలోని పెద్దేముల్ మండలంలో రూ. 10 లక్షల విలువైన నకిలీ విత్తనాలను సీజ్ చేసి న అధికారులు కర్ణాటక ప్రాంతానికి చెం దిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నా రు.
అయితే, ప్రధాన సూత్రధారి స్థానిక వ్యవసాయ, పోలీసు అధికారులకు తెలిసే దర్జాగా దందాను కొనసాగిస్తున్నాడని..అతడు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి పోలీసులు పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో మూడుసార్లు పట్టుబడి న వ్యక్తే జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నార ని.. అయినా ఇప్పటివరకు అతడిపై పీడీ యాక్ట్ అమలు చేయకపోవడంపై స్థానిక పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి.
మరోవైపు గతంలో తన పేరిట ఉన్న ఫర్టిలైజర్ దుకాణాన్ని అధికారులు మూసేయడంతో మరొకరి పేరిట లైసెన్స్ పొంది నకిలీ పత్తి విత్తనాల దందాను కొనసాగిస్తున్నాడని.. ఇదంతా తెలిసి కూడా అతడికి లైసెన్స్ మంజూరు చేయడంపై స్థానిక వ్యవసాయాధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. గతం లో జిల్లా వ్యవసాయాధికారిగా పనిచేసిన గోపాల్ సదరు అక్రమార్కుడి కొత్త షాపునకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా లైసెన్స్ మంజూరు చేయలేదు. ఆయన బదిలీ కాగానే వచ్చిన కొత్త అధికారితో స్థానిక అధికారులు లైసెన్స్ ఇప్పించినట్లు సమాచారం.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ప్రాంతంలో నివాసముంటున్నారు. వారిలో కొంతమంది నకిలీ పత్తి విత్తనాల దందా చేస్తూ.. అక్రమంగా జిల్లాలోని కొడంగల్, తాండూరు తదితర ప్రాంతాలకు వాటిని తరలిస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాల దందా నడిపిస్తున్న వారి వివరాలు తెలిసినా.. పోలీసులు కేవలం వారి వద్ద లభించిన నకిలీ విత్తనాలను మాత్రమే సీజ్ చేస్తూ జిల్లాకు అక్రమంగా నకిలీ విత్తనాల తరలింపును అడ్డుకట్ట వేయడం లేదనే ఆరోపణలున్నాయి. పోలీసుల నిఘా వైఫల్యంతో చెక్‌పోస్టులు నామమాత్రంగా మారాయనే విమర్శలున్నాయి. సరిహద్దులు దాటి యథేచ్ఛగా నకిలీ పత్తి విత్తనాలు జిల్లాలోకి వస్తున్నాయి.
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతు ఏదో రకంగా నష్టపోతూనే ఉన్నాడు. ముఖ్యంగా పత్తి రైతు విత్తనాలు మొదలుకొని పత్తిని విక్రయించే వరకూ మోసపోతున్నాడు. పంటల సాగుకు చేసిన అప్పులు, మరోవైపు నకిలీ విత్తనాల బారిన పడి అప్పుల్లో కూరుకుపోతున్నాడు. జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా సంబంధిత అధికారులకు తెలిసే నడుస్తున్నదన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో 2019 నుంచి ఇప్పటివరకు అధికారికంగా 200 క్వింటాళ్ల వరకు నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేసినప్పటికీ.. గుట్టుచప్పుడు కాకుండా వందల క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు అమాయక రైతులకు చేరాయి. 2019లో 47.97 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు, 2020లో 4.07 క్వింటాళ్లు, 2021లో 85.72, 2022లో 24.64, 2023లో 11.45, 2024లో 64 క్వింటాళ్లు, ప్రస్తుతం ఈ ఏడాది ఇప్పటివరకు 1.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారికంగా సీజ్ చేశారు