USS Gerald Ford : ఒకపక్క ఇరాన్‌పై అమెరికా దాడికి సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. అయితే, ఈ లోపు అమెరికా సైనికులకు ఒక చిక్కు వచ్చిపడింది. వారి యుద్ధ నౌకలో టాయిలెట్లు సరిగ్గా పని చేయడం లేదు. దీంతో 5,000 మంది సైనికులు ఇబ్బందిపడుతున్నారు. అమెరికా నేవీకి చెందిన యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ అనే భారీ యుద్ధనౌక దాదాపు 9 నెలలుగా అంటే.. గత జూన్ నుంచి సముద్రంలోనే ఉండిపోయింది. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ఈ నౌక ఇంతకాలం తీరానికి చేరుకోలేదు.
ఇందులో దాదాపు సిబ్బంది, సైనికులు కలిపి 5,000 మంది పని చేస్తున్నారు. అయితే, వీరికి ఇప్పుడు ఒక విచిత్రమైన సమస్య ఎదురైంది. నౌకలోని 650 టాయిలెట్లు సరిగ్గా పని చేయడం లేదు. చాలా కాలంగా నౌక సముద్రంలోనే ఉండిపోవడం వల్ల సరైన నిర్వహణ సాధ్యం కాలేదు. దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ చాలా వరకు పాడైంది. ఫలితంగా ప్లంబింగ్ సిస్టమ్ దెబ్బతింది. దీంతో టాయిలెట్లు బ్లాక్ అయి పనిచేయడం లేదు. ఇక్కడి టాయిలెట్లు వాక్యూమ్ సిస్టమ్ ద్వారా పని చేస్తాయి. గత జనవరి నుంచి ఇవి సరిగ్గా పని చేయడం లేదు. దీంతో పురుషులు, స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇలాంటి సమయంలో ఈ టాయిలెట్లు మరింత ఇబ్బంది పెడుతున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నా సరైన ఫలితం ఉండటం లేదు. తమకు కలుగుతున్న అసౌకర్యం విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఎనిమిది నెలలుగా సైన్యం, సిబ్బంది నౌక నుంచి బయటకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడి మోహరింపు పూర్తవగానే కొందరు సైన్యాన్ని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఈ నౌక అమెరికాకు చాలా కీలకం. ఇటీవల వెనెజులా అధ్యక్షుడిని తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలో ఈ నౌక కీలకంగా వ్యవహరించింది. మరోవైపు ఇరాన్‌పై దాడి విషయంలోనూ కీలకంగా మారనుంది.