Shadnagar | షాద్‌నగర్, మే 2 : ప్రారంభానికి అర్భాటాలు తప్పా, రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు, పాలకులు ఘోరంగా విఫలమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారుల నుంచి రైతులను రక్షించాలని సూచిస్తున్న ఆ దిశగా మాత్రం అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దళారుల చేతుల్లో మోసపోకుండా మద్ధతు ధరతో లబ్ధి పొందాలని ప్రభుత్వం చెపుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం కార్యచరణ లేదు.
ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రంలో తమ ధాన్యాన్ని విక్రయించుకుంటే మద్ధతు ధరతో పాటు రూ. 500 బోనస్ వస్తదే అనే విషయం తెలిసిన రైతులు మాత్రం కొనుగోళ్ల కేంద్రం వైపు వెళ్లడం లేదు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు వడ్లను అమ్ముకునే పరిస్థితి నెలకొంది. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్, కొందుర్గు, చౌదరిగూడ మండలాలకు కలిపి షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎండకాలం పంట వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గత నెల 29న ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఐదు రోజులు గడుస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రం కొనసాగుతుందనే విషయం సమీప గ్రామాల రైతులకు సహితం తెలియని పరిస్థితి.
పైగా ఉదయం 11 గంటలు అయిన కొనుగోలు కేంద్రం తెరువడం లేదని రైతులు వాపోతున్నారు. తేమను పరీక్షించే మిషన్, తూకం పరికరాలు, నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించే సిబ్బంది వంటి వసతులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అన్నింటికి మించి మద్ధతు ధర, బోనస్ వంటి అంశాలు తెలియక రైతులు బహిరంగ మార్కెట్లో తమ పంటను విక్రయించుకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వడ్లను అమ్ముకుంటే సకాలంలో డబ్బులు రావని, బోనస్ వేయడం లేదనే ప్రచారం ఉండటంతో రైతులు ఆ వైపు చూడటం లేదని వ్యాపారులు సహితం బహిరంగా చర్చించుకుంటున్నారు. షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్లో మాత్రం ప్రారంభ సమయం నాటి నుంచి నేటి వరకు 1500 బస్తాలు, సుమారు 600 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే సేకరించామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
పొద్దుగాల వచ్చి కూసున్నం.. ఎవ్వరు పలుకరియ్యరు..
సేను కోసిన వడ్లను తీసురావాలా? వద్దా? అని అడుగనికే వచ్చిన. పోద్దుగాల వచ్చిన ఎవ్వరు పట్టించుకోరు, పలుకరియ్యరు. ఎన్ని రోజుల్లో పైసలు వస్తయో చెప్పరు. తేమ చెక్చేయడానికి కొన్ని వడ్లను చెచ్చిన. వాటిని ముట్టి కూడ చూస్తలేరు. మిషన్ లేదని చెపుతున్నారు. ఎప్పుడు వస్తదే అంటే తెలువదు అంటున్నారు. ఎవ్వరి అడుగాలో తెలుస్తలేదు. గిసోటి సమస్యలు ఉంటయనే చాల మంది రైతులు సేట్లకు అమ్ముకుంటుండ్రు.
– జగన్, రైతు, గంట్లవెల్లి, ఫరూఖ్‌నగర్ మండలం
రూ. 1900 లకే అమ్ముకుంటున్నం
మాకు వడ్ల కొనుగోలు కేంద్రం ఉన్నట్లు తెలువదు. అయిన వాళ్లకు అమ్మితే పైసలు టైమ్‌కు రావు. వాళ్లు ఇచ్చె వరకు కూలోళ్లు ఆగరు. పెట్టుబడి ఊకే అయితే రాదు కదా. వాన కాలంలో అమ్ముకున్న రైతులకు ఇప్పటికి బోనస్ పైసలు రాలేదని అంటుండ్రు. ఇవన్ని తిప్పలు ఎందుకని మార్కెట్లో సేట్‌కు అమ్ముతున్న. ఇక్కడ క్వింటాల్ వడ్లకు రూ. 1900 నుంచి రూ. 2000 ధర వస్తుంది. అయిన ఇక్కడే అమ్ముకుంటుండ్రు.
– తౌర్య, రైతు, హేమాజీపూర్