వికారాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఏప్రిల్‌లోనే మొదలు కావాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నెల రోజులు ఆలస్యంగా షురూ కాగా.. అప్పటి నుంచి అన్నదాత అవస్థలు పడుతూనే ఉన్నాడు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన అనంతరం, మిల్లుల వద్ద కూడా తూకం వేస్తుండడంతో తీవ్ర జాప్యం జరుగుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నారు. జిల్లాలో కేవలం ఏడు మాత్రమే బాయిల్డ్ మిల్లులు ఉండగా అవి నిండిపోవడంతో రైతులు పది, పదిహేను రోజులపాటు మిల్లుల వద్ద జాగా రం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో ఇతర జిల్లాలోని బాయిల్డ్ మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దోమ మండలంలోని మోత్కూరు వద్ద గత నెలరోజులుగా రోడ్డుకు ఇరువైపులా ధాన్యం లోడ్లతో వాహనాలు బారులు తీరాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టిన నాటి నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే వడ్లు పండించిన రైతులు కష్టాలు పడుతున్నారు.
జిల్లాలో రైతన్న అరిగోస పడుతున్నాడు. ప్రతి ఏటా ఈ సమయానికి ధాన్యం సేకరణ ముగిసే పరిస్థితులుండగా, ఈ ఏడాది మాత్రం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దోమ, కులకచర్ల, బషీరాబాద్ తదితర మండలాల్లో రైతులు నెల రోజులుగా ధాన్యాన్ని విక్రయించేందుకు పడిగాపులు పడుతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు పేరిట రైతులను దోపిడీ చేస్తున్నారు. క్వింటాల్‌కు 10 కిలోల వరకు తరుగు పేరిట తూకం వేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బస్తాలో 40 కిలోల ధాన్యాన్ని తూకం వేస్తుండగా, తరుగు ఒక్కో బస్తాకు 4 కిలోలు వరకు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
గత బీఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే బిల్లింగ్ కూడా పూర్తయ్యేది. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం బిల్లింగ్ బాధ్యత మిల్లర్లకు అప్పజెప్పడంతో రైతులను నట్టేట ముంచుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన తర్వాత మిల్లుల్లో మరోసారి తూకం వేసి బిల్లింగ్ చేస్తుండడంతో భారీ మొత్తంలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లు-కొనుగోలు కేంద్రా ల నిర్వాహకులు కుమ్మక్కై ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నా యి. ఈ దోపిడీ వ్యవహారం సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. కాగా, జిల్లాలో ఇప్పటివరకు 77,694 మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని సేకరించారు. మరోవైపు ఇప్పటివరకు 13,965 మంది రైతు ల నుంచి రూ.185 కోట్ల విలువ గల ధాన్యాన్ని సేకరించగా, రూ. 136 కోట్ల చెల్లింపులు ఇప్పటివరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మరో 49 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.