ఇబ్రహీంపట్నం, జూన్ 5 : ఈ ఏడాది నైరుతి ముందుగానే రావడంతో అన్నదాత సాగు పనుల్లో నిమగ్నమయ్యాడు. వారం రోజుల కిందట పలువురు రైతులు విత్తనాలను నాటారు. అయితే వరుణుడు దోబూచులాడుతుండడంతో పంటల సాగు విషయంలో సందిగ్ధంలో పడ్డాడు. సాధారణంగా జూన్ మొదటి వారం తర్వాత రైతులు విత్తనాలు వేస్తారు. ఈ సారి వానకాలం రాక ముందే వర్షాలు కురువడం.. అవి తొలకరి వర్షాలని.. అల్పపీడన ప్రభావంతో పడుతున్నాయని పలువురు పేర్కొంటుండడంతో రైతన్న గందరగోళంలో ఉన్నాడు.
కాగా, జిల్లాలోని పలువురు రైతులు దుక్కులు దున్ని.. ఇప్పటికే పత్తి విత్తనాలను వేశారు. తొలకరి వానలు ఎత్తిపోతుండడంతో సాగు చేద్దామా..ఆగుదామా..? అన్న మీమాసంలో అన్నదాత ఉన్నాడు. సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలుంటాయని సామెత ఉన్నది. కానీ, ఇంతకు ముందెన్నడూ చూడని భిన్నమైన వాతావరణం ఈసారి ఎదురవుతుండడంతో భవిష్యత్తు ఎలా ఉంటుందోనని రైతన్న ఆందోళన చెందుతున్నాడు. ప్రస్తుతం రైతులు దుక్కులు సిద్ధం చేసుకుని పనుల్లో నిమగ్నయమ్యాడు.
గతంలో ఎప్పుడు లేని విధంగా నైరుతి రుతుపవనాలు ముందే వచ్చా యి. ఈ సమయంలో రైతులు దుక్కులను సిద్ధం చేసుకోవాలి. 60 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే విత్తనాలు వేసుకోవాలి. తొందరపడి విత్తనాలు వేస్తే చీడపీడల బారీన పడే ప్రమాదమున్నది. అందువల్ల రైతులు తొందరపడొద్దు. -శ్రవణ్‌కుమార్, ఏఈవో ఇబ్రహీంపట్నం