ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతకు ఆగచాట్లు తప్పడంలేదు. మంచాల మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి అన్నదాత తీసుకొచ్చిన ధాన్యం తూకం వేయకపోవడంతో ధాన్యం రాశుల వద్దే గత 20 రోజులుగా నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేంద్రానికి మండలంలోని చిత్తాపూర్, తాళ్లపల్లిగూడ, తిప్పాయిగూడ, జాపాల, మంచాల, లింగంపల్లి తదితర గ్రా మాల నుంచి రైతులు తమ ధాన్యాన్ని తీసుకొచ్చి.. కల్లాల్లో గత 20 రోజులుగా ఆరబెట్టినా ధాన్యాన్ని కొనడం లేదని.. ఈ కేంద్రంలో సరైన వసతులు లేకపోవడంతో.. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వడ్లు తడిసి ముద్ద అయి.. మొలకలు వచ్చాయని వాపోతున్నారు. అధికారులు సకాలంలో కొనుగోలు చేసి ఉంటే ధాన్యం వర్షానికి తడిసేది కాదని..ప్రభుత్వ నిర్లక్ష్యంతో తమకు ఇబ్బందులు తప్పడంలేదని లబోదిబోమంటున్నారు. తడిసిన వడ్లను ఆరబెట్టడమే పనిగా మారిందని మండిపడుతున్నారు.
-మంచాల, మే 22
పండించిన పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి 20 రోజుల కిందట తీసుకొచ్చా. తేమ శాతం ఎక్కువగా ఉన్నదని తూకం చేయకపోవడంతో .. కల్లాల్లోనే ఆరబెడుతున్నా. ప్రస్తుతం తేమ శా తం తగ్గింది. అయినా కొనడంలేదు. దీం తో గత 20 రోజులుగా ప్రతిరోజూ ధా న్యం కుప్పల వద్ద కాపలాగా ఉంటున్నా.
-అచ్చన్న అంజయ్య(తాళ్లపల్లి గూడ రైతు)