రంగారెడ్డి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రైతు భరోసాపై సర్కారు నోరు మెదపకపోవడంతో జిల్లాలోని రైతులు అయోమయానికి గురవుతున్నారు. యాసంగి సీజన్ ప్రారంభమైనప్పటికీ అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలో యాసంగి సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నది. ఇప్పటికే అన్నదాతలు నారుమడులు పోసి సిద్ధంగా ఉంచారు. వరి నాట్లు పనులు ప్రారంభం కావల్సి ఉన్నది. కాని, ఇప్పటివరకు రైతులకు మాత్రం పెట్టుబడి సాయం అందించే విషయంలో సర్కారు స్పష్టత ఇవ్వడంలేదు.
జిల్లాలో 2.82 లక్షల మంది అన్నదాతలున్నారు. వీరికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి సీజన్లో రూ.323 కోట్లు రైతు బంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించేది. కాని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చి.. రైతు భరోసాలో ఎక్కడికక్కడ కోత విధిస్తున్నారు. ప్రతి ఏటా అన్నదాతలు వ్యవసాయ సీజన్లో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూసి చివరకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వడ్డీలకు తెచ్చి పెట్టుబడి పెట్టినా రైతులకు గిట్టుబాటు ధర కూడా సరిగ్గా రాక తీవ్రంగా నష్టపోతున్నారు.
కాంగ్రెస్ సర్కారు జిల్లాలోని ఔటర్ పరిసర గ్రామాల్లోని అన్నదాతలకు గత వర్షాకాలం సీజన్లో పూర్తిగా రైతు భరోసా నిలిపివేసింది. ఔటర్ లోపల, వెలుపల గ్రామాల్లో వ్యవసాయం లేదన్న సాకుతో పెట్టుబడి సాయం నిలిపివేయడంతో బాధిత రైతులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. అన్నదాతల ఆందోళనకు దిగివచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు మూడెకరాల్లోపున్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందించింది. ఈసారి కూడా ఔటర్ లోపలి చుట్టుపక్కల గ్రామాల అన్నదాతలకు రైతు భరోసా వస్తుందా.. లేదా తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు.
ఎన్నికలకు ముందు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచుతున్నది. పంటల సాగు సమయంలో సాయం పెంచి అందిస్తామని చెప్పి ఇప్పుడు మాట దాటవేస్తూ అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. పంటల సాగుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. రైతులకు పెట్టుబడి సాయం సకాలంలో అందజేసి ఆదుకోవాలి.
– బూడిద నర్సింహారెడ్డి
కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచి నాలుగు విడతలుగా రైతు భరోసా అందించడంలో పూర్తిగా విఫలమైంది. పంటల సాగు గడువు దాటిపోతున్నా నేటికీ రైతు భరోసా అందించడంలో నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో అన్నదాతలకు సకాలంలో పెట్టుబడి సాయం అంది పంటలను సాగు చేసుకున్నారు. కాని, కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి పెట్టుబడి కోసం ఇబ్బందులు పడుతున్నారు.
– చిలుకల బుగ్గరాములు