బషీరాబాద్, మే 26 : నాలుగైదు రోజులుగా పడుతున్న వర్షాలకు తోడు ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం బస్తాలు మొలకెత్తాయి. మండలవ్యాప్తంగా ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. కాశీపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా, పీఏసీఎస్(పాక్స్) ఆధ్వర్యంలో దామర్చెడ్, మైల్వార్, నవాల్గ, నవాంద్గి గ్రామాల్లో ఏర్పాటు చేశారు. నవాల్గ, నవాంద్గి గ్రామాలకు చెందిన కొనుగోలు కేంద్రాలను మండల కేంద్రంలో నిర్వహిస్తున్నారు.
భారీ వర్షం, నిర్వాహకుల నిర్లక్ష్యంతో ధాన్యం బస్తాలు తడిసి మొలకెత్తాయి. కొనుగోలు కేంద్రం వద్ద 25 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యాన్ని తూకం చేయాలని రైతులు నిర్వాహకులను కోరుతున్నా వారు స్పందించడం లేదని వాపోతున్నారు. సకాలంలో తూకాలు చేస్తే ధాన్యం తడిసేది కాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని రోజంతా ఎండబెట్టి కుప్ప పోసి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వర్షాలకు ధాన్యం తడిసిపోతున్నదని పేర్కొన్నారు. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి అని రైతులు పేర్కొన్నారు. గత పది సంవత్సరాల కాలంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదని అన్నదాతలు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యంతోనే మాకు ఈ గతి పట్టిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం నీట మునిగి..
యాలాల : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదురుచూడక ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వెనువెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించి రైతులు ఎక్కడా నష్టపోకుండా, కష్టపడకుండా చివరి గింజ వరకు రైతుల నుంచి కొనేది. వారం తిరిగే లోపు టక్టక్మని రైతుల అకౌంట్లలో పడేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వం వెరసి రైతుల కళ్లల్లో నీళ్లను తెప్పిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితులు వచ్చాయి.
మండల పరిధిలో అన్ని కొనుగోలు కేంద్రాలను ఒకేసారి ప్రారంభించినప్పటికీ కొన్ని 15, 20 రోజులైనా ప్రారంభం కాలేదు. ప్రారంభం కాని కేంద్రాలు హమాలీల కొరతను సాకుగా చూపించాయి. ఏదో రకంగా ప్రారంభమైన అన్ని కొనుగోలు కేంద్రాలు రైతుల వద్ద నుంచి 100 శాతం ధాన్యాన్ని సేకరించలేకపోయాయి. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు రైతులు సకాలంలో తీసుకువచ్చినా, ఆ ధాన్యాన్ని మిల్లులకు పంపడంలో కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ముందు వచ్చిన వారిని పక్కన పెట్టి వెనకొచ్చిన వారి ధాన్యాన్ని మిల్లులకు పంపడమేమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం పండించిన పండించిన పంటను కాపాడుకోవడం ఒక ఎత్తయితే… చేతికొచ్చిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్రత్యక్షసాక్ష్యంగా మండల పరిధిలోని బెన్నూరు కొనుగోలు కేంద్రం నిలిచింది. అకాల వర్షాలు పడుతున్నాయని తెలిసి కూడా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యాన్ని మిల్లులకు పంపకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం నీట మునిగి రైతన్నలకు కన్నీళ్లు మిగిలాయి. వారి నిరీక్షణకు తెరపడేదెప్పుడో..