వికారాబాద్, నమస్తే తెలంగాణ, జూలై 27 : జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు అంచనాలను మించలేకపోయింది. 2.63 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతదని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. 2.41 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం.. చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో అన్నదాతలు వరిసాగుపై ఆసక్తి చూపడంలేదు. గతేడాది వానకాలంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 99,549 ఎకరాలు కాగా.. అంతకుమించి 1.33 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
ఈ ఏడాది 1.10 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తారని అధికారులు అంచనా వేయగా.. ఇప్పటివరకు కేవలం 9,357 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు వేశారు. అయితే ఆగస్టు రెండోవారం వరకు వరినాట్లు వేయడానికి అవకాశం ఉండడంతో వరి సాగు విస్తీర్ణం కొంత మేర పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు.
ఇక కంది 1.04 లక్షల ఎకరాల్లో, మక్కజొన్న 29,871, జొన్న 1666, మినుములు 5,108, పెసర 12,513, సోయా 2185, చెరకు 600, వేరుశనగ 500, బెబ్బెర్లు 610, ఆముదం 20, రాగులు 45, ఇతర పంటలు 250 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. గతేడాది వానకాలంలో పంటల సాగు విస్తీర్ణం అంచనా 5.78 లక్షల ఎకరాలుకాగా.. 5.67 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది 5.97 లక్షల ఎకరాల్లో ఆయా పంటలను సాగవుతాయని అంచనా వేయగా.. ఇప్పటివరకు 4.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.