ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మా త్రం తీరడంలేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. పీఏసీఎస్‌లు, సహకార సంఘాలు, ఆగ్రోరైతు సేవా కేంద్రాల ఎదుట తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తున్నా అరకొరగా అందుతున్న యూరియా పంటలకు సరిపోకపోవడంతో రైతన్న ఆందోళన చెందుతున్నాడు.
షాబాద్, సెప్టెంబర్ 15 : మండలంలోని రైతువేదిక వద్ద ఉదయం 6 గంటల నుంచే రైతులు యూరియా టోకెన్ల కోసం భారీగా క్యూలో నిలబడ్డారు. రోజుల తరబడిగా క్యూలో పడిగాపులు కాసినా తమకు సరిపడా యూరియా దొరకడం లేదని మండిపడ్డారు. గత వారంలో టోకెన్లు తీసుకున్న కొంతమంది రైతులకు ఇప్పటివరకు యూరియా అందలేదని, కొత్తగా టోకెన్లు తీసుకునే రైతులకు యూరియా ఎప్పుడు ఇస్తారోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత పదేండ్లలో ఎన్నడూ యూరియా కోసం ఇన్ని కష్టాలు పడలేదని రైతులు మండిపడ్డారు.
పోలీస్ పహారాలో పంపిణీ
కడ్తాల్ : మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కేంద్రం గోదాముకు 450 బస్తాలు, రావిచేడ్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 225 సంచులు, కడ్తాల్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 225 యూరియా సంచులు ఆదివారం వచ్చాయి. సోమవారం తెల్లవారుజామునే యూరి యా కోసం రైతులు పీఏసీఎస్ గోదాం, ఆగ్రోస్ సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు. క్యూలో నిలబడ్డ రైతులకు పోలీస్ పహారాలో టోకెన్లు అందజేసి, రెండు బ్యాగుల చొప్పున యూరియా పంపిణీ చేశారు. యూరియా అందని రైతులు నిరాశతో ఇండ్లకెళ్లారు.
ఉదయం ఆరు గంటల నుంచే..
శంకర్పల్లి : మండలంలోని సొసైటీ కార్యాలయం వద్ద ఉదయం ఆరుగంటల నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరారు. పనులు మానుకొని గంటల తరబడి పడిగాపులు కాసినా యూరియా దొరకడం కష్టంగానే ఉందని రైతులు ఆందోళన చెందారు.
పీఏసీఎస్ వద్ద బారులు
షాద్‌నగర్‌టౌన్ : షాద్‌నగర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద సోమవారం యూరియా కోసం రైతులు బారులుదీరారు. ఒకరినొకరూ తోసుకుంటూ ఎగబడ్డారు. యూరియా కోసం రోజుల తరబడి చూస్తున్న దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలో నిలబడిన కొందరికి రెం డు బ్యాగులే దొరకగా మిగిలిన వారికి దొరక్కపోవడంతో నిరాశతో వెళ్లిపోయా రు. రైతులకు సరిపడా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.