జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా భూగర్భజలాలు తగ్గడంతోపాటు కరెంట్ కోతలతో వరి పంట ఎండుముఖం పడుతున్నది. వరి సాగు చేసిన భూములు నీళ్లు లేక నెర్రెలు తేలిన దయనీయ పరిస్థితులు జిల్లాలో ఎక్కడా చూసినా కనిపిస్తున్నాయి. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ఎండుముఖం పట్టడంతో పుట్టెడు దుఃఖంలో జిల్లా రైతాంగం మునిగిపోయింది. జిల్లావ్యాప్తంగా 90వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, ఇప్పటివరకు దాదాపు 20వేల ఎకరాల వరకు వరి పంట ఎండుముఖం పట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజులైతే సాగు చేసిన వరి పంటలో సగానికిపైగా ఎండిపోయే పరిస్థితులున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఎండుముఖంపట్టిన వరి పంటను కొందరు రైతులు ఆశలు వదులుకొని పశువులకు మేత కోసం వదులుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాలేని పరిస్థితితో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో భూగర్భజలాలు కూడా 13.50 మీటర్ల లోతుకు అడుగంటిపోవడంతో బోర్లలో నీటినిల్వలు తగ్గిపోతున్నాయి. దీనికి కరెంట్ కోతలు ఉండడంతో వేసిన పంటలో 25 శాతం పంటలనైనా కాపాడుకోవచ్చు అనుకున్న రైతుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లి అధికారికంగా నాలుగున్నర గంటలకుపైగా విద్యుత్తు సరఫరాకు కోతలు విధిస్తూ, అనధికారికంగా ఓవర్ లోడ్ పేరిట ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నది.
– వికారాబాద్, మార్చి 17, (నమస్తే తెలంగాణ)
రేవంత్‌రెడ్డి రైతుల్ని ఆగం చేసిండు..
అధిక వడ్డీకి అప్పు చేసి నాలుగు ఎకరాల్లో వరి పంట వేస్తే మూడెకరాల్లో పంట పూర్తిగా ఎండిపోగా.. మరో ఎకరా పంట కూడా వారం రోజుల్లో ఎండిపోయే పరిస్థితులున్నాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా పోయి, లగోడి కూడా మీద పడింది. గత పదేళ్లలో ఎప్పుడూలేని విధంగా పరిస్థితి దాపురించింది. కనీసం తినడానికి కూడా దిగుబడి రాలేదు. అప్పులు ఇచ్చిన వ్యక్తి అప్పు చెల్లించాలని బలవంతం చేస్తే మా కుటుంబానికి ఆత్మహత్యలే శరణ్యం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చెరువుల్లో పూడికతీత పనులతో చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండేది, భూగర్భజలాలు సరిపోను ఉండి యాసంగిలోనూ గుంట పంట నష్టపోకుండా పంటలు పండేవి. 24 గంటల కరెంట్ ఉంటుండే, ఏ సమయంలో చేనుకెళ్లి బోరు వేసినా పంటలకు నీరు పారేది. రాత్రి సమయంలో విద్యుత్తు షాక్‌లు, పాముకాటుకు గురై మృతిచెందిన సంఘటనలు లేకుండాపోయాయి. అయితే రేవంత్‌రెడ్డిని నమ్మి ఓటేస్తే రైతుల్ని మోసం చేసి ఆగం చేసిండు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ ఉంటలేదు. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. కరెంట్ ఎప్పుడొస్తదా అని పొలం వద్ద ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. మాకు లాగోడికి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయానికి ముందే కేసీఆర్ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని జమ చేసేది. అప్పులు చేసుడు అనేది మరిచిపోయినం. కేసీఆర్ కంటే ఎక్కువ పెట్టుబడి సాయం ఇస్తామంటే నమ్మి కాంగ్రెస్‌కు ఓటేస్తే గెలిచినంక ఏడాదికి కొంత మంది రైతులకే పెట్టుబడి సాయాన్ని వేసిండు. నాలుగు ఎకరాలున్న నాలాంటి రైతులకు ఇంకా పెట్టుబడి సాయాన్ని అందించలేదు. లాగోడికి పైసలు ఇయ్యకుండా, కరెంట్ ఇయ్యకుండా, రైతులను ఆదుకోకుండా రేవంత్‌రెడ్డి ఆగం చేసిండు. రైతులను రోడ్డున పడేసిన రేవంత్‌రెడ్డికి తగిన బుద్ధి చెబుతాం.
– దేవులానాయక్, పులిచింతలమడుగుతండా, ధారూరు మండలం