కొడంగల్, సెప్టెంబర్ 3 : గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు.. అన్నదాతలకు అపార పంట నష్టాన్ని మిగిల్చాయి. సాయం చేసి ఆదుకోవాలని రైతన్నలు ఎదురుచూస్తూ దిగులుచెందుతున్నారు. వానకాలం ప్రారంభం నాటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఆశించినంత మేరకు వర్షాలు కురవలేదు. ఇటీవల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువడంతో చెరువులు, కుంటల్లో నీళ్లు చేరాయి. కాగా, పంటలు నీట మునగడంతో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో 13 గ్రామాల్లో వరి, కంది, పత్తి పంటలు పెద్ద మొత్తంలో నష్టపోయాయి.
కొడంగల్ మండల పరిధలో 32 మంది రైతులకు సంబంధించి 46 ఎకరాల వరి, 10 మంది రైతులకు సంబంధించి 32 ఎకరాల్లో కంది పంట, 54 మందికి సంబంధించి 79 ఎకరాలు పత్తి పంట నీట మునిగినట్లు తెలిపారు. దౌల్తాబాద్ మండల పరిధిలో 39 మందికి సంబంధించి 52 ఎకరాల్లో పత్తి పంట, ఆరుగురు రైతులకు సంబంధించి 10 ఎకరాల్లో కంది పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయాధికారి ఏడీఏ శంకర్రాథోడ్ తెలిపారు. ప్రస్తుతం తమ దృష్టికి వచ్చిన పంటలను పరిశీలిస్తున్నామని ఏడీఏ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇలాకాలో చాలా వరకు నష్టం జరిగినప్పటికీ పంట నష్టాన్ని లెక్కించడంలో అధికారులు చేస్తున్న జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దౌల్తాబాద్ మండల పరిధిలోని కుదురుమల్ల గ్రామంలో రెండు ఎకరాల్లో సాగు చేసిన పెసర పంట కాస్త నీటి పాలై మొలకలెత్తాయని రైతు పంటను చూసి రోదిస్తున్నాడు.
ఇప్పటి వరకు కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులను పరామర్శించిన దాఖలాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో పంట నష్టం వివరాలను సేకరించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పంట నష్టంపై ఏడీఏ శంకర్రాథోడ్ను వివరణ కోరగా.. డివిజన్ పరిధిలో కంది, పత్తి, వరి పంట పెద్ద మొత్తంలో నీట మునిగినట్లు గుర్తించడం జరిగిందన్నారు. నీట మునిగిన పంటల్లో నీటిని తీసివేస్తే కొంతమేర నష్టాన్ని నివారించవచ్చని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. నష్టపోయిన పంటలను పరిశీలిస్తున్నామని, వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.
ఇటీవల కురిసిన వర్షాలకు పంట ధ్వంసమైంది. రెండు ఎకరాలు కంది, ఎకరం పత్తి పంటలను సాగు చేశా. చేతికొచ్చిన పంట నేలపాలైంది. మా గోడును పట్టించుకునే నాథుడే లేడు. దాదాపు రూ.లక్ష వరకు పంట నష్టం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు ఎవరూ స్పందించలేదు. కనీసం నీట మునిగిన పంటను పరిశీలించలేదు.
– రాజశేఖర్, పాతకొడంగల్, కొడంగల్
వేసిన పంటంతా నీటిపాలైంది. 4 ఎకరాల్లో మినము, పెసర పంటలను సాగు చేశా. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. వర్షాలు కురవడంతో మినుము, పెసర పంట మొలకెత్తింది. అధికారులు స్పందించి పంటను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలి.
– మోహన్ యాదవ్, పాత కొడంగల్
చేతి కొచ్చిన పంట నీటి పాలైంది. రెండు ఎకరాల్లో దాదాపు రూ.30వేలు పెట్టుబడి పెట్టి పెసర పంట సాగు చేశా. ఈసారి పంట బాగా కాసింది. కోతకొచ్చిందని సంతోషపడే సమయానికే వాన దేవుడు ముంచేసిండు. సుమారుగా రూ.లక్ష వరకు నష్టం వచ్చింది. అప్పు చేసి సాగు చేశా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
– సాయిలు, కుదురుమల్ల, దౌల్తాబాద్ మండలం, కొడంగల్