జిల్లాలో పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్‌లు పోరుబాట పట్టినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామా ల్లో పలు అభివృద్ధి పనుల నిమిత్తం ప్రొసీడింగ్‌లు ఇచ్చి నిధులను కేటాయించింది. దీంతో అప్పటి సర్పంచ్‌లు పల్లెల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, అంతర్గత, కాలనీల మధ్య సీసీ రోడ్లు తదితర పనులను చురుగ్గా చేపట్టారు.
అయితే అసెంబ్లీ ఎన్నికలు వచ్చి.. ప్రభుత్వం మారి.. కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నిధుల విడుదలను పూర్తిగా నిలిపేసింది. గ్రామపంచాయతీల్లో నిధులున్నా ఎలాంటి చెల్లింపులు చేయొద్దని ట్రెజరీలకు ఆదేశాలిచ్చింది. దీంతో తాము చేపట్టిన పనులకు బిల్లులివ్వాలంటూ గత సర్పంచ్‌లు ఆందోళన బాటపట్టారు.
తమకు రావల్సిన పెండింగ్ బిల్లులను ఇవ్వాలని ముఖ్యమంత్రి, మంత్రులకు పలుసార్లు వినతిపత్రాలను అందజేశారు. అయినా వారి గోడు ఎవరికీ పట్టడం లేదు. అప్పులు చేసి.. బంగారాన్ని తనఖా పెట్టి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని.. పెండింగ్ నిధులను విడుదల చేయకుంటే తాము రోడ్డున పడుతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారుగా రూ.80 నుంచి రూ.90 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం.
-రంగారెడ్డి, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ)
జిల్లాలోని 21 మండలాల్లోని 549 గ్రామపంచాయతీల్లో పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయి. గత సర్పంచ్‌లు గ్రామాల్లో పంచాయతీ నూతన భవనాలు, కమ్యూనిటీ హాల్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీరోడ్లు, వైకుంఠధామాలు వంటి పలు పనులను చేపట్టారు. గత కేసీఆర్ ప్రభుత్వం నిధులను విడుదల చేసి ప్రొసీడింగ్లూ కేటాయించింది. అయితే ప్రభుత్వం మారి.. నిధులు విడుదల కాకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో మాజీ సర్పంచ్‌లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
తాము చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులను చెల్లించాలని మాజీ సర్పంచ్‌లు గతేడాదిగా పోరుబాట కొనసాగిస్తున్నారు. తమ పదవీకాలం ముగిసిన వెంటనే పం చాయతీల చెక్ పవర్‌ను సెక్రటరీలకు కేటాయించటంతో పెండింగ్ బిల్లులను ఎవరిని అడగాలో తెలియని అయోమ య పరిస్థితి వారిలో నెలకొన్నది. కొన్ని పంచాయతీల్లో నిధులున్నా పెండింగ్ బిల్లులను చెల్లించొద్దని ప్రభుత్వం ట్రెజరీలను ఆదేశించడంతో ఆ ప్రక్రియ అక్కడే ఆగిపోయింది. దీంతో మాజీ సర్పంచ్‌లు ఏడాదిగా పోరాటాన్ని కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు.
తన హయాంలో గ్రామం అభివృద్ధి చెందాలని.. అప్పులు తెచ్చి.. బంగారాన్ని బ్యాంకుల్లో తనఖా పెట్టి డబ్బులు తీసుకొచ్చి పనులు చేపట్టా. చేపట్టిన పనులకు దాదాపుగా రూ.30 లక్షల వరకు రావాల్సి ఉన్నది. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రులను కోరినా ప్రయోజనం లేదు. ఆందోళన చేసేందుకు వెళ్తే మమ్ముల్ని అడ్డుకుని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పెం డింగ్ బిల్లులను చెల్లించాలి. -గంగిరెడ్డి బల్వంత్‌రెడ్డి, రాయపోల్ మాజీ సర్పంచ్
బీఆర్ఎస్ హయాంలో అనేక అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్‌లు అందా యి. ప్రభుత్వం అందజేసిన ప్రతి ప్రొసీడింగ్కూ ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేయడంతో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్లాయి. అయితే ప్రభుత్వం మారి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదు. చెల్లించమని ఆందోళన చేపడితే ముందస్తుగా పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బిల్లులు చెల్లించి ఆదుకోవాలి. -చిలుకల యాదగిరి మాజీ సర్పంచ్, తులేకలాన్..