సిటీబ్యూరో, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ) : ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మెట్రో ఫేస్-2లో స్టేషన్ల సంఖ్యపై హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో అథారిటీ తర్జన భర్జనలు పడుతున్నది. 76.4 కిలోమీటర్ల, 54 స్టేషన్లతో నిత్యం 8 లక్షల మంది ఐదు కారిడార్లలో ప్రయాణించేలా డీపీఆర్ సిద్ధం చేశారు. అయితే తాజాగా కొన్ని మార్గాల్లో స్టేషన్లను తగ్గించే యోచనలో మెట్రో ఉన్నట్లు తెలిసింది. దీని ద్వారా ఆయా మార్గాల్లో మెట్రో వేగం పెరుగుతుందని చెబుతుండగా, ప్రస్తుతం ఉన్న కారిడార్లలో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా, భవిష్యత్‌లో ఈ వేగం మరో ఐదు కిలోమీటర్లు పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించారు. ఈ క్రమంలోనే మెట్రో స్టేషన్ల కుదించాలా? వద్దా అనే అంశంలో హెచ్ఏఎంఎల్ సమాలోచనలు చేస్తున్నది.
దాదాపు రూ. 24.3వేల కోట్ల అంచనా వ్యయంతో మెట్రో ఫేస్-2 చేపట్టనున్నారు. 54 స్టేషన్లను ప్రతిపాదించారు. ఇందులో ప్రధానంగా కారిడార్-4లో ఉన్న నాగోల్-శంషాబాద్ మెట్రో మార్గంలో 24 స్టేషన్లు ఉండగా, 13.4 కిలోమీటర్లు ప్రయాణించే కారిడార్-7లో మియాపూర్-పటాన్చెరులో 10 స్టేషన్లు ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో ప్రధానమైన ఎయిర్‌పోర్టు మెట్రో విషయంలో వేగాన్ని పెంచేందుకు స్టేషన్లను కుదించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ దీంతో భవిష్యత్‌లో ఈ మార్గంలో కొత్త మెట్రో స్టేషన్ల నిర్మాణం సాధ్యం కాదనే క్రమంలో.. స్టేషన్ల కుదింపు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం 54 స్టేషన్లతో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును హెచ్ఏఎంఎల్ రూపొందించి కేంద్రానికి అందజేసింది. ప్రస్తుతం కేంద్ర పరిశీలనలో ఉంది. డీపీఆర్ అధ్యయనం, పరిశీలన తర్వాత కేంద్రం పలు సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ప్రాజెక్టు అంచనా వ్యయం, స్టేషన్లు, భూ సేకరణ వంటి అంశాలపై కేంద్ర సూచనలకు అనుగుణంగా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఆ లోపే మెట్రో స్టేషన్లను కుదించి, తుది ఆమోదం కోసం రివైజ్ డీపీఆర్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మెట్రో స్టేషన్ల కుదింపు అంశంపై మెట్రో వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణం వ్యయం కూడా తగ్గనున్నది. కానీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్టేషన్ల నిర్మాణం జరగాల్సి ఉంటుంది. కానీ అనూహ్యంగా స్టేషన్ల సంఖ్యను కుదించాలని మెట్రో భావించడంపై ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పెదవి విరుస్తున్నారు. తమ ప్రాంతానికి రవాణా సదుపాయాలను కోల్పోయే ప్రమాదం ఉంటుందని, ప్రతిపాదిత ఆలైన్మెంట్ ప్రకారమే మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.