షాద్‌నగర్‌టౌన్, ఆగస్టు 28: అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయాధికారులు, బ్యాంకర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రుణమాఫీకి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు.
అదే విధంగా రుణమాఫీ కానీ రైతులకు సంబంధించి లోన్ రెన్యూవల్, ఆధార్ నంబర్ల తప్పులను సరి చేసి రుణమాఫీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రుణమాఫీ కోసం బ్యాంకుకు వచ్చే రైతుకు రుణమాఫీ వివరాలను ఇవ్వడంతో పాటు సలహాలు, సూచనలు చేయాలన్నారు. ప్రతి బ్యాంకర్ రుణాల జాబితాను తయారు చేయాలని, అందులో రుణమాఫీ ఎంత మంది రైతులకు అయింది, రుణమాఫీ కానీ వారి జాబితాను తయారు చేసి అర్హులైన వారికి రుణమాఫీ అయ్యే విధంగా చూడాలన్నారు.
రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు ప్రభుత్వం రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ రూపొందించడం జరిగిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రుణమాఫీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీ రాజారత్నం, మాజీ జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, నాయకులు బాల్‌రాజు, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతులు ఆందోళన చెందొద్దు
చేవెళ్ల రూరల్ : మూడు విడుతల్లో రుణాలు మాఫీ కాని రైతులు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని అర్హులందరికీ మాఫీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని మండల వ్యవసాయ శాఖ అధికారి శంకర్‌లాల్ అన్నారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ, పల్గుట్ట గ్రామాల్లో రుణమాఫీ కాని రైతుల జాబితాను పరిశీలించి వారి కుటుంబ సభ్యుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రిను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. రైతులు తమ కుటుంబ సభ్యుల పేర్లు, వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు సహకరించాలని కోరారు. వ్యవసాయ అధికారి వెంట ఏఈవో స్వాతిప్రియ, రైతులు తదితరులు ఉన్నారు.
నేటి నుంచి ఇంటింటికీ సర్వే
మంచాల : నేటి నుంచి మంచాల మండలం వివిధ గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పంటరుణ మాఫీపై ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంచాల వ్యవసాయ శాఖ అధికారి మాధవీలత బుధవారం తెలిపారు.
ఈనెల 29న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బండలేమూరు, 30న లింగంపల్లి, 31న చిత్తాపూర్ సెప్టెంబర్ 2న తాళ్లపల్లిగూడ, 3న తిప్పాయిగూడ, 4న నోముల, 5న ఆగపల్లి, 6న కాగజ్‌ఘట్, 9న అస్మత్పూర్, 10న రంగాపూర్, 11న పీసీతండా,12న జాపాల, 13న దాద్పత్తి, 17న చీదేడు, 18న చెన్నారెడ్డిగూడ, 19న సత్తితండా, 20న కొర్రవాని తండా, 21న ఎల్లమ్మతండా, 23న బోడకొండ, 24న లోయపల్లి, 25న ఆంబోత్తండా, 26న ఆరుట్లలో ఏవోలు ఇంటింటా తిరుగుతూ పంటరుణమాఫీ కానీ రైతుల కుటుంబ సభ్యుల వివరాలను యాప్‌లో నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.