జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్నట్లుగానే అన్నదాతల ఆశలు కూడా ఆవిరవుతున్నాయి. ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని అందించకున్నా.. అప్పులు చేసి వరి పంటను సాగు చేసిన అన్నదాతకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటుతుండడంతో జిల్లాలో వెయ్యికి పైగా బోరుబావులు ఎండిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వాటి కింద సాగు చేసిన వరి పంట ఎండుముఖం పడుతున్నది. దానిని కాపాడుకునేందుకు కొత్తగా బోర్లు తవ్విస్తున్నా నీరు పడడంలేదు. కాగా జిల్లాలో 93,000 ఎకరాల్లో అన్నదాతలు వరి పంటను సాగు చేశారు.
రంగారెడ్డి, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు మండలాల్లో గణనీయంగా తగ్గిపోతున్న భూగర్భజలాలతో వరి పంట ఎండుముఖం పడుతున్నది. యాసంగిపై ఎన్నో ఆశ లు పెట్టుకున్న రైతన్నకు కన్నీరే మిగులుతున్నది. ప్రభుత్వం పెట్టుబడి సా యాన్ని అందించకపోయినా అప్పులు చేసి పంటలు సాగు చేసినా అన్నదాతను కరువు వెంటాడుతున్నది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కేశంపేట, కొందుర్గు, ఆమనగల్లు తదితర మండలాల్లో వరి పంట ఎండిపోతున్నది. ఈ నెల ఆరంభం నుంచే పంటలు ఎండిపోవడం ఆరం భమైంది.
15 రోజుల వ్యవధిలోనే భూగర్భజలాలు గణనీయంగా పడిపోవడంతో జిల్లాలోని సుమారు వెయ్యికిపైగా బోరుబావులు ఎండిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు లక్షలాది రూపాయలు అప్పులు చేసి బోర్లు తవ్విస్తున్నా గంగ మ్మ పైకి రావడంలేదు. ఇప్పటికే మంచాల మండలంలోని చిత్తాపూర్, తిప్పాయిగూడ, రంగాపూ ర్, చీదేడు, బండాలేమూర్, దాత్పల్లి, కొర్రతండా, సత్తితండా, లోయపల్లి, ఆం బోతుతండా వంటి ప్రాంతాల్లో వరి పంట ఎం డుముఖం పట్టింది. దీంతో అన్నదాతలు తమ పంటను పశువుల మేతకు ఉపయోగిస్తున్నారు.
జిల్లాలో 93 వేల ఎకరాల్లో సాగు..
ఈ యాసంగిలో జిల్లాలో 93 వేల ఎకరాల్లో వరి పంటను అన్నదాతలు సాగు చేశారు. ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని అందించకు న్నా రైతులు వడ్డీ వ్యాపారులు ఇతరుల వద్ద అప్పులు చేసి సాగు చేశారు.అయితే, జిల్లాలో ఒక్కసారిగా భూగర్భజలాలు అడుగంటిపోతుండడం తో బోర్లు వట్టిపోయి.. వాటి కింద సాగు చేసిన పంటలూ ఎండుముఖం పడుతున్నాయి. రోజురోజుకూ ఎండలు మండుతుండడంతో పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మంచాల, యా చారం, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కొందుర్గు, కేశంపేట, చౌదరిగూడ వంటి పలు మండలాల్లో కరువు ఘంటికలు మోగుతున్నాయి.
మళ్లీ వలస వెళ్లాల్సిందే..?
బీఆర్ఎస్ హయాంలో చెరువులు, బోర్లలో సమృద్ధిగా నీరు ఉండడంతోపాటు.. ఠంచన్‌గా రైతుబంధు పెట్టుబడి సాయం సీజన్‌కు ముందే బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పలువురు రైతులు స్వగ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుని కుటుంబాలతో కలిసి సంతోషంగా జీవించా రు. అయితే.. గత 15 నెలల కాంగ్రెస్ పాలన అస్త వ్యస్తంగా మారడం.. ఇప్పటికీ చాలామంది రైతులకు రైతుభరోసా పెట్టుబడి సాయం అందనేలేదు. దీంతో వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేసి పంటల ను సాగు చేయగా.. అడుగంటుతున్న భూగర్భ జలా లు, విద్యుత్తు కోతలతో సాగు చేసిన పంట పండని పరిస్థితి నెలకొన్నది. పెట్టుబడి రాని పరిస్థితి ఉండడంతో అప్పు లు తీర్చేందుకు మళ్లీ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎండిన పంటను చూస్తే ఏడుపు వస్తున్నది
అప్పులు చేసి పంటను సాగు చేశా. కండ్ల ముందే పంట ఎండిపోతుండడం తో ఏడుపు వస్తున్నది. పెట్టుబడికి పెట్టిన డబ్బు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. వ్య వసాయాన్ని నమ్ముకున్న రైతన్నకు ప్రతిఏటా అప్పులే మిగులుతున్నాయి. అప్పులు తీర్చేందుకు వ్యవసాయాన్ని వదిలి ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది.
-వెంకటాచారి లోయపల్లి
అప్పులు ఎలా చెల్లించాలో అర్థం కావడంలేదు..
రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి పంటను సాగు చేశా. ఇందుకోసం వ్యాపారి వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నా. అయితే భూగర్భజలా లు పాతాళానికి చేరుతుండడంతో పంట ఎండిపోతున్నది. అప్పు ఇచ్చిన వ్యాపారి ఇంటికి వస్తే ఏమి చెప్పాలో.. ఏ విధంగా ఆ అప్పును చెల్లించాలో అర్థం కావడంలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
-చిల్కూరి కావ్య, కౌలురైతు; రంగాపూర్