వికారాబాద్, జూన్ 22 : ఏరువాక పౌర్ణమిని రైతులు ఘనంగా జరుపుకొన్నారు. శనివారం వికారాబాద్, మోమిన్‌పేట, మర్పల్లి, ధారూరు, బంట్వారం, కోట్‌పల్లి, నవాబుపేట మండలాల్లోని రైతులు పశువులకు రంగులు అద్ది, అందంగా ముస్తాబు చేశారు. డప్పు చప్పుళ్లతో ఎడ్ల బండ్లను గ్రామాల్లో ఊరేగించారు. ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేసి ఈసారి పంటలు బాగా పండాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన తీపి వంటకాలను ముందుగా రైతులు పెంచుకుంటున్న పశువులకు పెట్టి పూజించారు.
ధారూరు : ధారూరుతో పాటు మండల పరిధిలోని తరిగోపుల, నాగారం, కుక్కింద, నాగసముందర్, మోమిన్‌కలాన్, మోమిన్‌ఖుర్దు, దోర్నాల్, ఎబ్బనూరు, చింతకుంట, గురుదోట్ల, అంపల్లి తదితర గ్రామాల్లో రైతన్నలు ఘనంగా ఏరువాక పౌర్ణమి పండుగను జరుపుకొన్నారు. కాడెద్దులు, ఎడ్ల బండ్లను ప్రధాన కూడళ్లలో ఊరేగించారు. కాడెద్దులు, ఎడ్ల బండ్లను చూడడానికి ప్రజలు ఆసక్తి చూపారు.
బొంరాస్‌పేట : బొంరాస్‌పేట, దుద్యాల మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకొన్నారు. ఉదయమే రైతులు పశువులు, ట్రాక్టర్లు, జేసీబీలను శుభ్రంగా కడిగి రంగులతో అందంగా అలంకరించారు. పశువులకు భక్ష్యాలు తినిపించి పూజలు చేశారు. సాయంత్రం రైతులు గ్రామాల్లోని వీధుల గుండా పశువులు, ట్రాక్టర్లు, జేసీబీలను ఊరేగించారు. ప్రజలు ఆలయాలను దర్శించుకుని పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయం సాఫీగా కొనసాగాలని ప్రార్థించారు.