రంగారెడ్డి, జూలై 16, (నమస్తే తెలంగాణ) : నిరుపేద ఉపాధి హామీ కూలీల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మీయ భరోసా పథకం అమలు అయోమయంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భూముల్లేని నిరుపేద ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా జిల్లాలో 10,199 మంది కూలీలను అర్హులుగా గుర్తించింది. జిల్లావ్యాప్తంగా లక్షా 58 వేలమంది కూలీలు ఉండగా అందులో పదివేల మందిని గుర్తించి మిగతా వారిని విస్మరించారు. గుర్తించిన వారిలో మొదటి విడతగా రూ.6 కోట్ల 23 లక్షలు కూలీలకు అందజేశారు.
రెండో విడత గడువు దాటిపోయినప్పటికీ ఇప్పటివరకు వారికి ఆత్మీయ భరోసా నిధులు అందించడం లేదు. నిధులు ఇస్తామని ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాటవేస్తున్నది. రెండో విడతలో జిల్లాకు మరో ఆరు కోట్ల 23 లక్షలు రావాల్సి ఉన్నది. గడువు దాటిపోయినప్పటికీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వలన జిల్లాలోని కూలీలు ఎదురుచూస్తున్నారు. వెంటనే రెండో విడత ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఆత్మీయ భరోసా కింద ఎంపిక చేసిన ఒక్కొక్క ఉపాధి హామీ కూలీకి మొదటి విడుతలో రూ.6000 కేటాయించింది. రెండో విడత మరో ఆరువేల రూపాయలను ఇవ్వాల్సి ఉన్నది.
అర్హులకు అందని సహాయం.
జిల్లావ్యాప్తంగా ఎంతో మంది అర్హులు ఉన్నారని, వారందరిని గుర్తించి ఆత్మీయ భరోసా కింద సహాయం అందించాలని పలువురు కూలీలు కోరుతున్నారు. జిల్లాలో 1,58,675 మంది జాబ్ కార్డులు కలిగినవారు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,60,278 మంది కూలీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఎంతోమంది భూములు లేని నిరుపేదలు ఉన్నారు. ఆత్మీయ భరోసా పథకం కింద ఎంపిక చేసినప్పుడు అధికారులు అర్హులైన వారు ఎంతో మంది ఉన్నప్పటికీ తమను ఎంపిక చేయలేదని వాపోతున్నారు. 2023- 2024 సంవత్సరంలో 20 రోజులు ఉపాధి హామీ కూలి పని చేసిన వారికి మాత్రమే ఆత్మీయ భరోసా వర్తిస్తుందని పెట్టిన నిబంధన కూలీలకు అడ్డంకిగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం మరోసారి అర్హులైన వారిని గుర్తించి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.
మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ కూలీలు లేరనే సాకుతో ఆయా మున్సిపాలిటీలను ఉపాధి హామీ పథకం నుంచి మినహాయించారు. జిల్లాలో అత్యధికంగా 16 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో అనేక గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు ఉన్నప్పటికీ ఉపాధి హామీ పనులు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
మున్సిపాలిటీ పేరుతో ఉపాధి హామీ నిలిపివేయడమే కాకుండా ఆత్మీయ భరోసాకు కూడా నోచుకోలేకపోతున్నామని వాపోతున్నారు. మున్సిపాలిటీల్లో కూడా ఉపాధి హామీ పనులను చేపట్టాలని కోర్టు ప్రభుత్వానికి సూచించినప్పటికీ పనులు మాత్రం చేపట్టడం లేదని వాపోతున్నారు. మున్సిపాలిటీల్లో కూడా నిరుపేద భూముల్లేని కూలీలకు ఆత్మీయ భరోసా అందించాలని కోరుతున్నారు.