కందుకూరు, సెప్టెంబర్ 8 : కందుకూరుకు లా కళాశాల మంజూరైనట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే జూనియర్, డిగ్రీ, బీఎడ్, మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని,
తాజాగా లా కళాశాలను కూడా మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. న్యాయ శాస్త్ర విద్య అభ్యసించాలనే వారికి మేలు జరుగనున్నదన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే లా కళాశాల కొనసాగుతుందని, మహేశ్వరం గేటు వద్ద ఉన్న బీసీ ప్రభుత్వ గురుకుల కళాశాలలో తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. బీఏఎల్ఎల్బీ, బీబీఏఎల్ఎల్బీ 5 సంవత్సరాల కోర్సులను ప్రారంభిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.