బండ్లగూడ, జనవరి 11: పొట్ట చేత పట్టుకుని వివిధ రాష్ర్టాల నుంచి వచ్చి చిరు వ్యాపారం చేస్తూ.. జీవనం సాగిస్తున్న వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. తెల్లవారే సరికి వారి డబ్బాలను కూల్చివేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. దీంతో వారు తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కన్నీరుమున్నీరయ్యారు. 20 ఏండ్లుగా తాము ఇక్కడ జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రకుంట వద్ద కొన్నేండ్లుగా చిరు వ్యాపారులు వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున కార్పొరేషన్ అధికారులు వచ్చి ఎర్రకుంట వద్ద ఉన్న డబ్బాలను తొలగించారు. ముందస్తుగా సమాచారం ఇస్తే సామగ్రిని తీసుకునే వారమని ఆవేదన చెందారు.
ఎర్రకుంట వద్ద హైదర్షాకోట్ గ్రామానికి చెందిన రేణుక భర్త చనిపోవడంతో పంక్చర్ దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నది. ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి రాత్రి అక్కడే నిద్రించింది. ఒక్కసారిగా తెల్లవారుజామున జరిగిన అలజడికి ఆమె బయటకు వచ్చి చూసే సరికి ఆమె ఉన్న డబ్బా పక్కనే ఉన్న డబ్బాను తొలగించడం కనిపించింది. దీంతో ఆమె అరుపులు విన్న అధికారులు ఆమెకు ఒక రోజు సమయం ఇచ్చి వెళ్లిపోయారు. తనకు మేలుకువ రాకపోతే తాము ఇప్పటికే చనిపోయేవారమని రేణుక రోదించింది.
అధికారుల చర్యలతో జీవనోపాధి కోల్పోయిన బాధితులకు అండగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిలిచారు. కార్పొరేషన్ అధ్యక్షుడు రావుల కోళ్ల నాగరాజు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎర్రకుంట వద్దకు వచ్చి బాధితులతో కలిసి నిరసన తెలిపారు. అధికారులు కాంగ్రెస్ నాయకుల చేతిలో కీలు బొమ్మలుగా మారి.. ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది కాంగ్రెస్ నాయకులు కావాలనే అధికారులతో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వెంట కార్పొరేటర్ రవీందర్రెడ్డి,మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, రాంప్రసాద్ తదితరులు ఉన్నారు.