రంగారెడ్డి, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. దీంతో బోరుబావులు అడుగంటి పెద్ద ఎత్తున పంటపొలాలు ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు అన్నదాతలు కొత్తగా బోర్లను తవ్విస్తున్నా.. మరోవైపు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నా సరిపోవడంలేదు. కాగా జిల్లాలో సుమారు 50 శాతానికిపైగా బోర్లు వట్టిపోయి.. వాటి కింద ఉన్న పొలాలు ఎండిపోతున్నాయి.
నాడు 200 ఫీట్లకే నీరు..
జిల్లాలో గత బీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటల్లో పూడికతీతతోపాటు.. కాల్వలకు మరమ్మతులు చేపట్టడంతో వర్షాకాలంలో వచ్చిన నీటితో చెరువులు, కుంటలు కళకళలాడేవి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులు, కుంటల్లోకి నీరొచ్చే కాల్వల మరమ్మతులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వర్షం నీరు చెరువులు, కుంటల్లోకి చేరక ఎండిపోతున్నాయి.
గతంలో జిల్లాలోని గ్రామీణ మండలాల్లో 200 ఫీట్లు వేస్తే నీరు సమృద్ధిగా వచ్చేది. కానీ, ప్రస్తుతం నీటిమట్టం తగ్గిపోవటంతో 800 నుంచి 1000 ఫీట్ల వరకు బోర్లు వేసినా నీరు రాని పరిస్థితి ఏర్పడింది. గతంలో బోర్లు వేస్తే రూ.50,000 వరకు ఖర్చయ్యేది. ప్రస్తుతం ఒక్క బోరు వేయాలంటే రూ.1,00,000 పైగానే ఖర్చవుతున్నది. అందుకు అన్నదాతలు అప్పులు చేస్తున్నారు.
రెండెకరాలకు నాలుగు బోర్లు
నాకు రెండెకరాల పొలం ఉన్నది. అందులో వరితోపాటు ఇతర తోటలను సాగు చేశా. అందుకోసం రూ. మూడు లక్షలు ఖర్చు చేసి మూడు బోర్లు వేయించా. ఆ బోర్లు మొత్తం వట్టిపోయి వేసిన వరి పంట ఎండుముఖం పట్టింది. ఉన్న పంటను కాపాడుకునేందుకు మరో బోరును తవ్వించగా.. అంతంత మాత్రంగానే నీరు వచ్చింది. బోరు, బోరుమోటర్ కోసం మరో రూ. రెండు లక్షల వరకు ఖర్చు అయింది. ఆ నీటితో పంటను పండించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నా.
-వెంకట్రెడ్డి, రైతు, చిత్తాపూర్, మంచాల
నాలుగు బోర్లు తవ్వించినా చుక్క నీరు లేదు..
నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉండగా.. అందులో నాలుగు బోర్లు తవ్వించా. అయినా బోర్లు వట్టిపోయి వరి పంట ఎండిపోయింది. ఒక్క బోరులోనూ చుక్క నీరు రాలేదు. అప్పులే మిగిలాయి.
– జెనిగ సత్తయ్య, తిప్పాయిగూడ