Drones | యాచారం, మార్చి20 : మండలంలో మళ్లీ డ్రోన్ల సంచారం కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి ఆకాశంలో డ్రోన్లు సంచరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో మరోసారి డ్రోన్లు జోరుగా సంచరించడంతో అధికారులు భూముల సర్వేను గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభించారని గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా ప్రతి రోజు ఐదారు డ్రోన్లు ఆకాశంలో సంచరించడంతో ప్రజలు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు.
బుధవారం రాత్రి మొండిగౌరెల్లి గ్రామంలో వరుసగా ఐదారు డ్రోన్లు గాల్లో తిరగడాన్ని గ్రామస్తులు గమనించారు. తమ సెల్ఫోన్లలో డ్రోన్ల వీడియోలను బంధించారు. అసలు డ్రోన్లు ఎందుకు గ్రామాలలో తిరుగుతున్నాయని కొంత మంది ఆలోచిస్తుంటే భూముల సర్వే చేస్తున్నారని కొంత మంది గుసగుసలాడుతున్నారు. అవి రాత్రిపూటనే ఎందుకు ఆకాశంలో సంచరిస్తున్నాయని ఇంకొంత మంది అనుకుంటున్నారు. వాటిని ఎవరు గాల్లోకి ఎగురేస్తున్నారని, ఎక్కడి నుంచి ఎగురేస్తున్నారని, డ్రోన్లు ఎగురవేయటంలో అంతర్యమేంటని ప్రజలు, రైతులు ఒక్కసారిగా ఆలోచనలో మునిగారు. పైగా అర్ధరాత్రి ఆకాశంలో పంటపొలాల వద్ద డ్రోన్లు గంటల తరబడి సంచరించడంతో అయోమయానికి గురవుతున్నారు.
ఇదిలా ఉంటే ఇటివలే మొండిగౌరెల్లి గ్రామంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం ప్రభుత్వం 821.11ఎకరాల భూసేకరణకు శ్రీకారం చుట్టింది. దీనికోసం ఇప్పటికే నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. గ్రామస్తులు నోటిఫికేషన్ను రద్దు చేయాలని ఆందోళనలకు దిగుతున్న విషయం తెలిసిందే, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే రాత్రిపూట గుట్టు చప్పడు కాకుండా డ్రోన్ల ద్వారా భూముల సర్వే పక్రియను కొనసాగిస్తున్నదని గ్రామస్తులు వాపోతున్నారు. గత ఆరు నెలల క్రితం ఎలాంటి అనుమతులు లేకుండా మేడిపల్లి, నానక్నర్, తాటిపర్తి, కుర్మిద్ద, చింతపట్ల, ధర్మన్నగూడ, మొండిగౌరెల్లి, తులేఖుర్థు తదితర గ్రామాలలో డ్రోన్లు తిరిగిన విషయం తెలిసిందే, మొండిగౌరెల్లి గ్రామంలో డ్రోన్లు సంచరించడంతో ఇక భూ సేకరన ఆగదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రులు చేసినా భూములు ఇచ్చేదిలేదని గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు.