ఒకప్పుడు గుక్కెడు నీటికోసం బిందెడు కష్టాలు పడాల్సి వచ్చేది.. ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకునేవారు.. అప్పుడప్పుడు వచ్చే నీటి ట్యాంకర్ కోసం పనిమానుకొని పడిగాపులు కాయాల్సిన దుస్థితి.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసనలు.. నల్లాల వద్ద కొట్లాటలు వంటివి రోజూ జరిగేవి.. కానీ నేడు ‘మిషన్ భగీరథ’తో నీటి గోస తీరింది. గడపగడపకూ స్వచ్ఛమైన నీరు అందుతున్నది.
ఉద్యమ సమయంలో నీటి కష్టాలను కండ్లారా చూసిన సీఎం కేసీఆర్.. మిషన్ భగీరథ పథకంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. జిల్లాలో 2,94,705 నల్లా కనెక్షన్ల ద్వారా ఇంటింటికీ శుద్ధ జలాలు అందుతున్నాయి. మారుమూల గ్రామాలు, తండాలకు సైతం తాగు నీరు సరఫరా అవుతున్నది. రూ.476కోట్లతో అధికారులు మిషన్ భగీరథ పనులు చేపట్టి జిల్లా పరిధిలోని 1,072 ఆవాసాలకు నీరు అందిస్తున్నారు.
‘మిషన్ భగీరథ’తో నీటి కష్టాలకు చెక్ పడడంతోపాటు ఫ్లోరైడ్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగింది. గత ఐదారేండ్లుగా జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదు. అలాగే నీళ్ల కారణంగా వచ్చే వ్యాధులు సైతం తగ్గుముఖం పట్టాయని వైద్యులు పేర్కొంటున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : ‘గుక్కెడు నీటికోసం బోరు, బావుల వద్దకు పరుగులు.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసనలు.. నల్లాల వద్ద కొట్లాటలు.. ఇవన్నీ ఒకప్పటి మాట. మిషన్ భగీరథ నీరు గడపగడపకూ చేరాక నీటి గోస తీరింది. ఉద్యమ సమయంలో నీటి కష్టాలను కండ్లారా చూసిన సీఎం కేసీఆర్.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆడపడుచులు ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసేలా చర్యలు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లాలో 2,94,705 నల్లా కనెక్షన్లను ఏర్పాటు చేసి ప్రతి ఆవాసానికీ మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం శుద్ద జలాలు అందిస్తున్నది. ఇందుకు రూ.476కోట్లను వెచ్చించింది. దీంతో తాగునీటి కోసం తండ్లాడిన మారుమూల గ్రామాలు, తండాలలకు తాగు నీరు సరఫరా అవుతుండడంతో జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.’
శ్రీశైలం బ్యాక్ వాటర్ పరివాహక ప్రాంతంలో ఉన్న యెల్లూరు రిజర్వాయర్ నుంచి సేకరించిన నీటిని ముచ్చెర్ల(కందుకూరు), అంతారం(షాబాద్), కమ్మదానం(షాద్‌నగర్), కల్వకుర్తిలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ది చేసి ఆవాసాలకు తరలిస్తున్నారు. రూ.476కోట్ల నిధులు వెచ్చించి జిల్లాలోని 22 మండలాల పరిధిలో ఉన్న 1,072 ఆవాసాలకు శుద్ద జలాలను పంపిణీ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించి నూతనంగా 877 వాటర్ ట్యాంకులను నిర్మించి 3,236 కిలోమీటర్ల మేర పైపులైన్ వేశారు. గడపగడపకూ నీరందించే ఉద్దేశంతో 2,94,705 నల్లా కనెక్షన్లను సైతం ఏర్పాటు చేశారు. సాగర్ బ్యాక్ వాటర్ నుంచి తరలివచ్చే నీటి శుద్ది ప్రక్రియను పకడ్బందీగా జరుపుతున్నారు. క్లోరినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాకనే స్వచ్ఛమైన నీటిని ఆవాసాలకు సరఫరా చేస్తున్నారు.
మారుమూల ఆవాసాలతోపాటు, గిరిజన తండాల్లోని ప్రజానీకానికి కలుషితే నీళ్లే జీవధార. ముఖ్యంగా తండా గిరిజనులు చెలిమ నీటితోనే గొంతులు తడుపుకోవాల్సిన దుస్థితి. ఉన్న కొద్దిపాటి బోర్లలో వచ్చే ఆ కొద్దిపాటి నీళ్లు సైతం ఫ్లోరైడ్‌తో కూడుకున్నవే. విధిలేని పరిస్థితుల్లో ఫ్లోరైడ్‌తో కూడిన ఆ గరళంతోనే గొంతు తడుపుకోవాల్సిన దైన్య పరిస్థితిని ప్రజానీకం ఎదుర్కొన్నది.
అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పథకం నీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేయడమే కాకుండా.. ఫ్లోరైడ్ నీటి సమస్య నుంచి విముక్తిని కల్పించింది. గడచిన ఐదారేండ్ల కాలంలో కొత్తగా ఫ్లోరోసిస్ కేసులు కూడా నమోదు కావడం లేదని వైద్యులు చెబుతున్నారు. అలాగే నీళ్ల కారణంగా వచ్చే వ్యాధులు సైతం తగ్గుముఖం పట్టాయని వారు పేర్కొంటున్నారు.
తాగునీటి కోసం తండ్లాట అయ్యేది. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి బావుల వద్దకు వెళ్లిన రోజులు గుర్తుకొస్తే కంటనీరు వస్తది. పొలాల దగ్గరికి వెళ్లినప్పుడు ఒక్కోసారి కరెంట్ ఉండకపోతుండే. సీఎం కేసీఆర్ సార్ వచ్చాక తండాలో తాగునీటి తిప్పలు తప్పాయి. తండాలో వాటర్ ట్యాంక్‌ని నిర్మించి నల్లాల ద్వారా ఇంటింటికీ తాగునీటిని వదులుతున్నారు. సీఎం కేసీఆర్‌కు ఓటు వేసి రుణం తీర్చుకుంటా.
– విస్లావత్ సోనీ (కడ్తాల్)
సీఎం కేసీఆర్ మనసున్న మారాజు. సమైక పాలనలో గుక్కెడు తాగునీటికి తహతహలాడేవాళ్లం. తెలంగాణ ఏర్పాటు తర్వాత తీసుకొన్న విప్లవాత్మక నిర్ణయంతో ప్రస్తుతం నదీ జలాలను శుద్ధి చేసి ప్రజలకు అందిస్తుండ్రు. అన్ని గ్రామాలకు నేడు నల్లా నీళ్లు సరఫరా అవుతున్నయ్. మహిళలు బిందెలు పట్టుకొని పొలాల వద్దకు, ఊరు శివారు ప్రాంతాలకు వెళ్లే రోజులు పోయినయ్. ఇప్పుడు ఇంటి ముందుకే తాగునీటిని అందిస్తున్న సీఎం కేసీఆర్ సారు సల్లంగుండాలే.
– అనంతమ్మ, గ్రామం అగ్గనూర్ (యాలాల)
ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యాన రోజూ కడుపునిండా నీళ్లు తాగుతున్నం. పదిహేనేండ్లకింద బోర్లకాడకు పోయి నీళ్లు తెచ్చుకునేటోళ్లం, దోనలల్ల తాగేటోల్లం. తెలంగాణ వచ్చినంక నీళ్ల కష్టం పోయింది. ఇంటికాడికే నీల్లొస్తున్నాయి. సీఎం కేసీఆర్ సారుకే మళ్లీ ఓటు వేస్తా.
– కొర్ర మోతి, పటేల్చెర్వుతండా (మంచాల)
కేసీఆర్ నీళ్లు రాకమునుపు మా తండోళ్లంతా నీళ్ల కోసం బిందెలను తీసుకొని పక్కన ఉన్న సెలుకలపోంటి పోయేటోళ్లం. కానీ ఇప్పుడు తండాలనే ట్యాంక్ కట్టిండ్రు. ఇంటి ముందల నల్లాలు పెట్టిండ్రు. నీళ్ల కోసం ఇప్పుడైతే తిప్పలు లేవు. కేసీఆర్ పుణ్యాన నీళ్లు వస్తున్నయ్.
– నేజీ, కంకరాళ్ల తండా (కేశంపేట)
ఇప్పుడు అయితే నీళ్ల తిప్పలు లేవు. కేసీఆర్ నల్లాలు లేక ముందు నీళ్ల కోసం చాన ఇబ్బంది పడేది. పొద్దుగాల, పొద్దుమూకి నీళ్ల కోసం మంది బోర్లకాడికి పోయేటోళ్లం. ఇంట్లో ఒకరం పని పోకుండా ఉండి నీళ్లు తెచ్చుకునేది. నీళ్ల కోసం పడిన కష్టాలు గుర్తు చేసుకుంటే బాధకలుగుతది. కానీ ఇప్పుడు ఇండ్ల ముందుకే నీళ్లు వస్తున్నవి. అందరికీ సరిపోను నీళ్లు వస్తున్నవి.
– లక్ష్మీ, కంకరాళ్ల తండా (కేశంపేట)
ఎండాకాలం వచ్చిందంటే ఖాళీ బిందెలతో ఆందోళనలు చేపట్టేవారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి వందల కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణాజలాలను తీసుకొచ్చి ఇంటింటికీ సరఫరా చేయడం గొప్ప పరిణామం. ప్రజలకు పుష్కలంగా తాగునీరు అందుతున్నది. నీటి కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
అప్పట్లో నీళ్ల కోసం ఎంతో ఇబ్బందులు పడినాం.. నీళ్ల కోసం ఊర్లో రోజూ లొల్లులు కూడా అయితుండే. అప్పుడప్పుడు నీళ్ల కోసం చిన్నచిన్న పంచాయితీలు పెద్దగయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో అంతా మారిపోయింది. మాఊర్లో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వడంతో పొద్దుగాలనే స్వచ్ఛమైన నీరు వస్తున్నది. దీంతో గ్రామాల్లో నీళ్ల గొడవలు లేకుండా పోయాయి. కేసీఆర్ సారు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా.
– మొగిలి పావని(మంచాల)
తాగునీటి గోస తీర్చిన మిషన్ భగీరథ పథకం చరిత్రలో నిలుస్తుంది. గతంలో తెల్లవారుజాము నుంచే ఖాళీ బిందెలతో గుట్టల్లో పరుగులు తీయాల్సి వచ్చేది. నేడు మహిళలు ఇంటి వద్దనే స్వచ్ఛమైన శ్రీశైలం కృష్ణా జలాలను కడవల్లో నింపుకొంటున్నారు. ఒకప్పుడు శ్రీశైలం వెళ్లినప్పుడే కృష్ణనీటిని కంటికి అద్దుకునే వాళ్లం. నేడు అవసరాలు తీర్చుకొంటున్నాం. నీటి కష్టాలు తీర్చిన బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం.
– నారాయణరెడ్డి, ధర్మాపూర్, అంగడిరూచూర్ (కొడంగల్)
మిషన్ భగీరథతో తాగునీటి సమస్య తీర్చిన ఘనుడు సీఎం కేసీఆర్. నిత్యం ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా అవుతున్నది. గతంలో వ్యవసాయ బోర్లు, బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకునేది. ఒక్కోసారి పని మానుకుని నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఆడబిడ్డల గోస వర్ణనాతీతం. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అక్కడక్కడ చేతిపంపులు వేసినా అవి పని చేసేవికావు. తాగునీటి సమస్యకు శాస్వత పరిష్కారం చూపిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా. మళ్లీ బీఆర్ఎస్ కారుగుర్తుకే ఓటు వేస్తా.
– కడారి అల్లాజీ , గ్రామం ఇర్విన్ (మాడ్గుల)
గతంలో గ్రామాల్లో తాగునీటి సమస్యే అతిపెద్దది. ఎండాకాలంలో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసినా సరిపోయేవి కావు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లావేసి తాగునీటి గోస తీర్చిండు. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించుకుంటాం.
– భానూరి మమతారెడ్డి, సర్పంచ్ కక్కులూర్ (షాబాద్)
సీఎం కేసీఆర్ ‘మిషన్ భగీరథ’తో ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచిండు. నీళ్ల కోసం తిరగని బావి ఉండేది కాదు. ఎండాకాలం చేతి పంపుల దగ్గర కొట్టుకునేది. ఇప్పుడు ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తున్నయ్. కన్నీటి కష్టాలు తీర్చిన కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలె.
– తుల్చ చెన్నమ్మ, జూలపల్లి(మహ్మదాబాద్)