వికారాబాద్, మే 7 : బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై దాడి చేయడాన్ని వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. కరీంనగర్లో జరిగిన సంఘటన చూస్తుంటే రక్షకులే భక్షకులైనట్లుగా ఉందన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన బాధ్యతాయుతమైన పదవిని మరిచి, గుండాలను అరికట్టాల్సిన ఆయన.. గూండాయిజం చెలాయించి దాడి చేయడం దారుణమన్నారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కారును ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కౌశిక్‌రెడ్డి మాట్లాడిన మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు. బండి సంజయ్ నీకెందుకంత రోషం వస్తున్నదన్నారు. ఆ రోజు కర్ణాటక ఎంపీ తెలంగాణను పాకిస్తాన్‌తో పోల్చిన రోజు ఈ రోషం ఏమైందని ప్రశ్నించారు.
ఆంధ్రకు నిధుల వరదను ఇచ్చి, తెలంగాణకు మొండి చెయ్యి ఇచ్చిన కేంద్రంపై రోషం ఏమైందని నిలదీశారు. ఏ రోజైనా రేవంత్రెడ్డినిగాని, కాంగ్రెస్ ప్రభుత్వాన్నిగాని ఎండగట్టిన సందర్భాలున్నాయా అని మండిపడ్డారు. మీ లోపాయికార ఒప్పందం అందరికీ అర్థమవుతున్నదన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన చోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. గతంలో కామారెడ్డిలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందన్నారు. దాడులు చేయడం ఏమాత్రం సరికాదని, మరోసారి దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.