బూర్గంపహాడ్, ఆగస్టు 15 : తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బూర్గంపహాడ్ మండలానికి చెందిన కళాకారుడు నల్లమోతు సురేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు వేదిక రాష్ట్ర చైర్మన్ కుమారస్వామి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. తనపై విశ్వాసంతో రాష్ట్రస్థాయిలో బాధ్యత అప్పగించిన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, చైర్మన్, కార్యవర్గ సభ్యులకు సురేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం తన కృషిని గుర్తించి ఈ బాధ్యత అప్పగించడం తనకు మరింత బాధ్యత పెంచిందన్నారు. సురేశ్ తెలంగాణ రాష్ట్ర సాధనలో సంస్కృతి, కళలు, పాటలు, జానపద కళాకారునిగా కీలకపాత్ర పోషించారు. సురేశ్ రాష్ట్రస్థాయిలో ప్రధాన కార్యదర్శిగా నియమితులవడం పట్ల పలువురు ఉద్యమకారులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.