పరిగి, ఆగస్టు 17 : పరిగి ప్రాంతంలో ఇటీవల కుక్కకాట్లు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. గత నెలలో 250 కుక్కకాటు కేసులు నమోదైనట్లు సమాచారం. అలాగే ఈ నెల ప్రారంభం నుంచి పక్షం రోజుల వ్యవధిలో 158 కుక్కకాటు కేసులు నమోదైనట్లు తెలిసింది. ఈ లెక్కన రోజుకు కనీసం పది వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉన్నదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆదివారం పరిగి మున్సిపల్ పరిధిలో 16 మందిపై కుక్కలు దాడిచేశాయి. పట్టణంలోని ఖాన్ కాలనీ, మార్కెట్ యార్డులోనే 9 మంది కుక్క కాటుకు గురయ్యారు. దీంతో వారందరు పరిగిలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా ప్రాథమిక చికిత్స జరిపారు.
కొందరికి తీవ్రమైన కాటు వల్ల ఇవ్వాల్సిన మందులు అందుబాటులో లేకపోవడంతో తాండూరుకు రెఫర్ చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ ఎంపీపీ అరవిందరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్ తదితరులు పరిగి ఆసుపత్రికి వెళ్లి మందుల విషయమై డాక్టర్‌ను అడుగగా తమ వద్ద అందుబాటులో లేవని చెప్పడంతో మండిపడ్డారు. ఉన్నతాధికారులను సైతం సంప్రదించగా వారు నిర్లక్ష్యంగా మాట్లాడారని వారు తెలిపారు. అనంతరం కుక్కకాటుకు గురైనవారిని తాండూరు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ కూడా మందులు లేకపోవడంతో వికారాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాధితులకు బీఆర్ఎస్ నాయకులు దగ్గరుండి వైద్యం చేయించారు. కుక్కకాటు బాధితులకు ఏఆర్వీ వ్యాక్సిన్ ఇచ్చామని ఆసుపత్రి ఇన్చార్జి డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. కుక్కకాటుతో మాంసం బయటపడితే తప్పా ఇతర మందులు అవసరం లేదన్నారు. వాటిని సైతం తెప్పిస్తామని చెప్పడం గమనార్హం.
సర్వత్రా విమర్శలు
కుక్కకాటు తీవ్రంగా ఉన్నప్పటికీ ఇవ్వాల్సిన మందులు అందుబాటులో ఉంచకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకు సుమారు 10 కుక్కకాటు కేసులు నమోదవుతున్న తరుణంలో సైతం వైద్యాధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం. తీవ్రమైన కుక్కకాటుకు ఇవ్వాల్సిన మందులు అందుబాటులో ఉంచకపోవడం సరైంది కాదని పలువురు పేర్కొంటున్నారు. పరిగి పట్టణంలో వీధికుక్కలను నివారించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండగా వాటికి టీకాలు ఇప్పించడం లేదా, కు.ని.ఆపరేషన్ చేయించాలని పేర్కొంటున్నారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇప్పిస్తే తప్ప ఈ కుక్కకాటు నుంచి రక్షణ లేదని, మున్సిపల్ అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
కొడంగల్‌లో..
కొడంగల్ : మండల కేంద్రంలో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసి ఏకంగా ఆరుగురిపై దాడి చేసి గాయపరిచింది. ఆదివారం ఉదయం మున్సిపల్ కార్యాలయానికి ఉద్యోగి అనంతప్ప విధులకు హాజరయ్యేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఆయనపై ఓ వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. ఒక్కరితో ఆగకుండా మరో ఐదుగురిపై కూడా దాడి చేసింది. అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది వెంటనే గాయపడినవారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కొంత మందిని హైదరాబాద్‌కు తరలించారు. దాడికి పాల్పడిన కుక్కను మున్సిపల్ సిబ్బంది పట్టుకొని బంధించారు. మున్సిపల్ పరిధిలోని వీధుల్లో వీధి కుక్కల బెడద అధికంగా మారిందని, గత నాలుగు నెలల క్రితం మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకునే ప్రక్రియను చేపట్టారని.. కానీ ప్రస్తుతం ఆ పని చేయడం లేదని ప్రజలు వాపోయారు. చిన్న పిల్లలు వీధుల్లో తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా పరిస్థితిని గుర్తించి వీధి కుక్కల బెడదలను నివారించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.