ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని మహిళా ఉద్యోగులు, వైద్యసిబ్బంది, పారిశుధ్య కార్మికులను సన్మానించారు. వికారాబాద్ జడ్పీ కార్యాలయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పాల్గొన్నారు. కలెక్టరేట్లో జరిగిన సంబురాల్లో కలెక్టర్ నిఖిల కేక్ కట్ చేశారు.
షాబాద్, మార్చి 8: మహిళల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని స్టార్ గార్డెన్లో స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య పాల్గొన్నారు. అనంతరం ఆయన 500 మంది మహిళా ప్రజాప్రతినిధులు, పారిశు ధ్య కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, వైద్యసిబ్బందికి అవినాశ్‌రెడ్డి సహకారంతో చీరలను పంపిణీ చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళ లేనిదే ప్రపంచం లేదన్నారు. మహిళలు పురుషులతో దీటుగా అన్ని రంగాల్లో రాణించేలా సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రశాంతిరెడ్డి, వైస్ ఎంపీపీ జడల లక్ష్మి, ఎంపీడీవో అనురాధ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్నారెడ్డి, మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్‌రావు, శ్రీరాంరెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, మల్లేశ్, మధుసూదన్‌రెడ్డి, చాంద్‌పాషా, వరలక్ష్మి, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జీవన్‌రెడ్డి, మల్లారెడ్డి, మునీర్, సత్యం, నర్సింహులు, రాంచంద్రారెడ్డి, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.