వికారాబాద్, జనవరి 21 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆశవర్కర్లకు వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహిపాల్, పి.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టరేట్ వరకు ఆశ వర్కర్లు పాదయాత్ర చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు రూ.18వేల వేతనం ఇచ్చేలా తీర్మానం చేయాలని, ఉద్యోగోన్నతి, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
2024 ఫిబ్రవరి 9న, జూలై 30న, డిసెంబర్ 10న ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆశవర్కర్లు ధర్నా చేయగా, చర్చల సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ రూ.60 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చులు రూ.50 వేలు ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు ఇస్తామని, టార్గెట్స్ రద్దు చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇతర సమస్యలపైన ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేశారని వివరించారు. అనంతరం కలెక్టరేట్లోని కార్యాలయ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆశవర్కర్లు అమృత, ఉమాదేవి, లలిత, అరుణ, యాదమ్మ, సునీత, సుజాత, అంజమ్మ, అపురూప, శ్రీదేవి, సరిత, సులోచన తదితరులు పాల్గొన్నారు.