వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా జిల్లాలోని పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు అధికారులు లంచమిస్తేనే పనిచేస్తున్నారు. ప్రతి పనికీ ఇంత అని ఫిక్స్ చేసి మరీ వసూ లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, సర్వే అండ్ భూ రికార్డులు, వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖల్లో ఎంతో కొంత ముట్టజెప్పనిదే పనులు జరగని పరిస్థితి నెలకొన్నది. తాజాగా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోతోపాటు సీనియర్ అసిస్టెంట్ ఓ భూమి విషయం లో రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మరోవైపు లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, అవినీతికి పాల్పడితే కటకటాలు తప్పవని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఫోన్ నంబర్ 94404 46140 ను సంప్రదించాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు సూచిస్తున్నారు.
కొందరు అధికారులు లంచమిస్తేనే పని చేస్తున్నారు. రెవెన్యూశాఖలో కింది నుంచి పై స్థాయి వరకు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతున్నది. భూ సమస్యల పరిష్కారంలో రైతుల నుంచి అం దిన కాడికి దండుకుంటున్నారు. ఇందుకు ఆర్ఐ రిపోర్ట్, తహసీల్దార్ అప్రూవల్ తప్పనిసరి కావడంతో చాలా మండలాల్లో డబ్బులిస్తేనే పనులు జరుగుతున్నాయి. లేకుంటే ఏదో ఒక కొర్రీ పెట్టి రిజెక్టు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా భూముల రిజిస్ట్రేషన్లకు వచ్చే వారిని సైతం తహసీల్దార్లు వదలడంలేదని.. ఉదయం స్లాట్ ఉన్నా సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపుతూ ప్రాంతాన్ని బట్టి వసూలు చేస్తున్నారనే పలువురు మండిపడుతున్నారు. వైద్యారోగ్య శాఖలోనూ అవినీతి పెరిగిపోయిందనే ప్రచారం జోరందుకున్నది. వైద్యారోగ్యశాఖ కార్యాలయంతోపాటు క్లినిక్‌ల తనిఖీలు, సీజ్ పేరిట వసూళ్ల దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ల శాఖలోనూ అవినీతి పెరిగిపోయింది. సంబంధిత ఉద్యోగులు ప్రతి రిజిస్ట్రేషన్‌కూ డబ్బులిస్తేనే సంతకా లు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సదరు అధికారులు నేరుగా కాకుండా ఏజెంట్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్ శాఖల్లోనూ ప్రతి పనికీ కమీషన్ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొన్నది. సంబంధిత శాఖల అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఆయా శాఖలను బట్టి 5శాతం, 3, 2 శాతం మేర కమీషన్ ముట్టజెప్పాల్సిందే..! డబ్బులివ్వకపోతే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖలో చెక్కుపై సంతకం చేసేందుకూ రూ.2 వేలు లంచం ఇస్తేనే సంబంధిత ఉద్యోగులు సంతకం పెడుతున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పంచాయతీ రా జ్ శాఖలో పై అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఎంత చెల్లించాలో ముందే చెబుతారని.. ఆ మొత్తం ఇవ్వకుంటే ఫైళ్లు ముందుకు వెళ్లవనే ఆరోపణలున్నాయి.
తాండూరు : తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సా యంత్రం వరకు ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగాయి. భూమి పట్టా కోసం లంచం తీసుకుంటూ తాండూరు సబ్ కలెక్టర్(ఆర్డీవో) కార్యాలయ ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్‌రావు ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్న దా..? ఇంకా ఎవరెవరూ ఉన్నారనే విషయంపై సుదీర్ఘంగా విచారించారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఏసీబీ బృందాలు లంచం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్లలో నూ తనిఖీలు చేశారు. అనంతరం దానయ్య, మాణిక్‌రావును ఏసీబీ అధి కారులు హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ ఘటన జిల్లా లో కలకలం సృష్టించింది. నియోజకవర్గంలో దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిపై సీఎం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కలెక్టరేట్లోని టీఎస్‌ఈడబ్ల్యూఐసీ కార్యాలయంలో సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్.. ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి పరిగి రోడ్డులో రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పరిగిలో విద్యుత్ శాఖ ఏఈ, తాండూరు సబ్ రిజిస్ట్రార్ ఓ కాంట్రాక్టు విషయంలో లంచం తీసుకుంటుండగా డీఎస్పీ స్థాయి అధికారికి పట్టుబడ్డారు.
గతంలో పరిగి డిప్యూటీ తహసీల్దార్ రూ.15 వేలు లంచం తీసుకుంటూ కలెక్టరేట్ ఎదుట ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
నవాబుపేట మండలంలోని గేటువనంపల్లి వీఆర్వో రూ.4 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు.
జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సురేశ్ రిటైర్డ్ ఉద్యోగి పింఛన్ ఫైల్‌ను సంబంధిత ప్రధాన కార్యాలయానికి పంపేందుకు రూ.12 వేలు తీసుకుంటుండగా దొరికిపోయారు.
జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ ప్రవీణ్ వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.10 వేలు తీసుకుంటూ పట్టుబడ్డారు.
ఓ కాంట్రాక్టరు నుంచి ఆర్డబ్ల్యూఎస్ తాండూరు డివిజన్ ఇంజినీర్ శ్రీనివాస్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా..
ఓ భూ సర్వే విషయంలో జిల్లా సర్వే అండ్ భూరికార్డుల అధికారి సదాశివుడు రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.