సిటీబ్యూరో : మెట్రో రెండో దశ అష్ట వంకర్లు తిరుగుతున్నది. మొన్న 70 కి.మీ… నిన్న 78 కి.మీ… నేడు 116 కి.మీతో రెండో దశ ప్రాజెక్టుకు అధికారులు డీపీఆర్‌లను సిద్ధం చేస్తున్నారు. ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్న మెట్రో మార్గాలను కాంగ్రెస్ సర్కారు ఇలా అటు… ఇటు తిప్పుతూ..మార్పులు చేర్పులు చేస్తున్నది. పైగా అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. మొన్నటి వరకు రూ.20వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన మెట్రో అధికారులు.. తాజాగా రూ.32237 కోట్ల వ్యయం అవుతుందంటూ ప్రతిపాదనలు చేశారు. అలాగే ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్మెంట్ మార్చారు.
ఆరాంఘర్-బెంగళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైనును ప్రతిపాదించారు. ఎయిర్‌పోర్టు కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు భూగర్భ మార్గంలో నిర్మించనున్నారు. విమానాశ్రయం లోపలికి ఒకవైపు నుంచే మార్గాన్ని నిర్మించనున్నారు. పైగా రెండో దశలోనే ఫోర్త్ సిటీకి రైలు మార్గం ప్రతిపాదన చేర్చారు. నగరమే లేని చోటుకు ఇప్పుడే మెట్రో మార్గం ఏమిటంటూ.. పలువురు విమర్శిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మహానగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలకు చక్కని పరిష్కారాలు చూపుతూ మెట్రో మార్గాలను ప్రతిపాదిస్తే.. వాటిని రేవంత్ సర్కారు రద్దు చేసింది.ఇప్పటికిప్పుడు అవసరమైన చోట మెట్రో ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన ఉన్నా.. దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.
సీఎం రేవంత్ తన కలల ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న ఫోర్త్ సిటీ కోసం 7 మార్గాల మెట్రో డీపీఆర్‌లను ఇప్పటికీ పూర్తి చేయించలేదు. అయినా.. రెండో దశలోనే ఫోర్త్ మెట్రో రైలు మార్గం ప్రతిపాదన చేర్చడంపై నగరవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆదివారం హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి రెండో దశ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే ఉన్న మూడు కారిడార్లను పొడిగిస్తూ.. కొత్తగా ఆరు కారిడార్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు.
Metro 2
జల్పల్లి మీదుగా రద్దు…
తొలుత ప్రభుత్వం రెండో దశలో నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్పల్లి మీదుగా ఎయిర్‌పోర్టు లోపలికి మెట్రో మార్గాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. గత 4-5 నెలలుగా డీపీఆర్‌పై కసరత్తు చేసిన తర్వాత, ఫోర్త్ సిటీకి ప్రాధాన్యతనిస్తూ గతంలో ప్రతిపాదించిన మార్గాల్లో మార్పులు చేశారు. మైలార్‌దేవ్‌పల్లి నుంచి జల్పల్లి , పీ7 రోడ్డు, మామిడిపల్లి మీదుగా వెళ్లాల్సిన మెట్రో మార్గాన్ని రద్దు చేశారు. నాగోల్ నుంచి వచ్చే మార్గాన్ని ఇన్నర్ రింగు రోడ్డు మీదుగా ఆరాంఘర్ వరకు, అక్కడి కొత్త హైకోర్టు ముందు నుంచి శంషాబాద్ టౌన్, బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఎయిర్‌పోర్టు లోపలి వరకు ఒక మార్గాన్ని ప్రతిపాదించారు.
ఒకవైపు నుంచే..
కేసీఆర్ ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్‌పోర్టు లోపలికి హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి వైపు నుంచే రైడర్‌షిప్ (ప్రయాణికుల రద్దీ పరంగా) అధికంగా ఉంటుందని మెట్రో మార్గాలను ప్రతిపాదించింది. వాటిని రద్దు చేసినట్లు ప్రకటించడమే కాకుండా తక్కువ దూరంతో నగరం నుంచి ఎయిర్‌పోర్టు లోపలికి మెట్రో రైలును తీసుకెళ్తున్నామని ఎంతో గొప్పగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మళ్లీ కాంగ్రెస్ సర్కారు తన నిర్ణయాన్ని మార్చుకొని.. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మార్గంలోనే రూట్లను ఖరారు చేస్తున్నది. ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ నుంచి కొంగరకలాన్ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఫోర్త్ సిటీ కోసం కొత్తగా నిర్మించే 300 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మార్గంలో లైన్‌ను నిర్మించాలని నిర్ణయించారు.
రూ. 32,237 కోట్లతో రెండో దశ మెట్రో…
రెండో దశలో చేపడుతున్న మెట్రో ప్రాజెక్టు అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. మొన్నటి వరకు రూ. 20వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన అధికారులు, తాజాగా రూ.32,237 కోట్ల వ్యయం అవుతుందంటూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సీఎం ప్రత్యేక దృష్టి సారించిన ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వినూత్న రీతిలో డీపీఆర్ తయారు చేస్తున్నామని, ఫోర్త్ సిటీ మెట్రో మార్గమైన 40 కి.మీ కోసం రూ. 8వేల కోట్ల వ్యయమవుతుందని మెట్రో అధికారులు వెల్లడించారు. రెండో దశలోని ఇతర కారిడార్లను కలుపుకొని మొత్తం రెండో దశలో చేపట్టే 116 కి.మీ కారిడార్ల నిర్మాణానికి ఒకేసారి రూ.32,237 కోట్లుగా అంచనా వేశామన్నారు. దేశంలోని ఇతర నగరాల్లో చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుల తరహాలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టును అమలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.
1.6 కి.మీతో..భూగర్భ మార్గం…
ఇప్పటికే ఉన్న మూడు మెట్రో కారిడార్లను పొడిగిస్తూ కొత్తగా 6 కారిడార్లను నిర్మిస్తున్నారు. ఇందుకోసం హెచ్ఎండీఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా కోసం సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రతిపాదిత మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుందని, దీన్ని పూర్తి చేసిన తర్వాతే తుది డీపీఆర్‌ను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత కేంద్రప్రభుత్వ అనుమతుల కోసం వెళ్తామన్నారు. కారిడార్-4లో ప్రతిపాదించిన 36.6 కి.మీ మెట్రో మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ 35 కి.మీ మేర ఉంటే, మిగతా 1.6 కి.మీ దూరం భూగర్భంలో నిర్మించనున్నామని, ఎయిర్‌పోర్టు టర్మినల్ వద్దకు వెళ్లేందుకు వీలుగా భూగర్భంలోంచి మార్గాన్ని నిర్మించేలా డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఎండీ చెప్పారు.