శర్వానంద్ కథానాయకుడిగా ఉత్తర తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. ‘ఏ బ్లడ్ ఫెస్ట్’ ఉపశీర్షిక. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. బుధవారం హీరో శర్వానంద్ ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో ఆయన ఇంటెన్స్ అండ్ రగ్గ్డ్ లుక్‌లో కనిపిస్తున్నారు.
సినిమా తాలూకు హింసాత్మక ప్రపంచాన్ని రిప్రజెంట్ చేసేలా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తారని, ఇప్పటివరకు ఆయన ఈ తరహా మాస్ క్యారెక్టర్ చేయలేదని మేకర్స్ తెలిపారు. 1960 దశకం ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సాగే కథ ఇదని దర్శకుడు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: సంపత్‌నంది.