దహెగాం, ఆగస్టు 16 : దహెగాం మండలం చంద్రపల్లి పరిధిలోని పీకలగుండంకు చెందిన దుర్గం రామాంజనేయులు(19) విద్యుత్ షాక్తో ఆదివారం మృతి చెందాడు. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గిరివెల్లికి చెందిన కారు రాజన్న రా మాంజనేయులుకు ఫోన్ చేసి తన పొలంలోని డీటీఆర్ ఫీజులు పని చేయడం లేదని, వాటిని సరి చేయాలని కోరాడు. దీంతో రామాంజనేయులు పీకలగుండం పాఠశాల సమీపంలోని 11 కేవీ లైన్ ఏబీ స్వీచ్ బంద్ చేసేందుకు వెళ్లాడు. స్వీచ్ ఆఫ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే పడిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే రామాంజనేయులు బెల్లంపల్లి దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెం దినట్లు నిర్ధారించారు. మృతుని తల్లి దుర్గం నిమ్మబాయి ఫిర్యాదు మేరకు కారు రాజన్న, విద్యుత్ అధికారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
న్యాయం చేయాలని ధర్నా
విద్యుత్ షాక్తో మృతి చెందిన దుర్గం రామాంజనేయులు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు, నాయకులు కొంచవెల్లి విద్యుత్ ఉపకేంద్రం వద్ద మృతదేహంతో ధర్నా నిర్వహించారు. సర్పంచ్ కొమురవెల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రామాంజనేయులు మృతి చెందాడని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ధర్నా కొనసాగిస్తామని హెచ్చరించారు. స్పందించిన విద్యుత్ శాఖ డీఈ నాగరాజు ఫోన్లో మాట్లాడి..విద్యుత్ శాఖ ద్వారా రూ.8లక్షల పరిహారం అందిస్తామని, బాధ్యులైన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఆందోళనలో నాయకులు , మాజీ సర్పంచ్ లగ్గాం దామోదర్, మాజీ ఎంపీటీసీ గౌరె రాకేశ్, తిరుపతిగౌడ్, మామిడి భీమేశ్ పాల్గొన్నారు.