ఇబ్రహీంపట్నం, జూలై 7 : పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై రాస్తారోకో, ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రణయ్, శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పులను విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటమాడుతున్నదని వారు పేర్కొన్నారు.
వికారాబాద్ : పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు, అక్బర్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి వికారాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు విడుదల కాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు బలవంతపు వసూళ్లు చేస్తున్నాయన్నారు. అయినా సర్కారు స్పందించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బకాయిలు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. దీంతో ప్రైవేట్ యాజమాన్యాల నుంచి సర్టిఫికెట్లు పొందలేక పై చదువులకు వెళ్లలేకపోతున్నారని తెలిపారు. బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తేజ, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.