మంచి లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగుకు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్నది. ఈ ఏడాదిలో రంగారెడ్డి జిల్లాలో 5,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టేందుకు సర్కార్ అనుమతులివ్వగా… జిల్లా ఉద్యాన శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఆసక్తిగల రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. తోటలను సాగు చేసే రైతులకు అధికారులు మొక్కలను ఉచితంగా అందజేయనున్నారు. డ్రిప్ సిస్టమ్‌ను బీసీలకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీపై అందిస్తారు. పంట సాగు నుంచి కొనుగోలు వరకు బాధ్యతలను వాల్యూ ఆయిల్స్, గ్యాస్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌కు అప్పగించారు. పండించిన పంటలను ఈ సంస్థనే కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌కు పంపనున్నది. పన్నెండున్నర ఎకరాల వరకు రైతులు ప్రభుత్వం నుంచి రాయితీలు పొందే అవకాశం ఉన్నది.
-రంగారెడ్డి, జూలై 31(నమస్తే తెలంగాణ)
ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల విస్తరణపై దృష్టిపెట్టిన ప్రభుత్వం రైతులను ఆ దిశగా వడివడిగా అడుగులు వేయిస్తున్నది. ఈ క్రమంలోనే ఆయిల్ పామ్ సాగుకు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో 5,500 ఎకరాల్లో సాగు చేపట్టేందుకు అనుమతులిచ్చింది. ఈమేరకు ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఆసక్తిగల రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. రైతులకు మొక్కలను ఉచితంగా, డ్రిప్‌ను రాయితీపై సర్కారు అందజేయనుంది. పంట సాగు నుంచి కొనుగోలు వరకు బాధ్యతలను వాల్యూ ఆయిల్స్, గ్యాస్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌కు ప్రభుత్వం అప్పజెప్పింది.
మారుతున్న పరిస్థితులు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నది. ఈ తరుణంలో మార్కెట్లో పెరుగుతున్న ఆయిల్ ధరలతోపాటు వినియోగం పెరిగిన కారణంగా విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్న దిగుమతులను అరికట్టడానికి రైతులను ఆయిల్ పామ్ తోటల సాగు వైపు మళ్లిస్తున్నది. తోటల సాగుకు జిల్లా రైతాంగం ముందుకొచ్చేలా చైతన్యపరుస్తున్నది. 2023-24లో రంగారెడ్డి జిల్లాలో 5,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు కానుంది. ఆయిల్ పామ్ విస్తరణ, నర్సరీల నిర్వహణ, గెలల ప్రాసెసింగ్ బాధ్యతలను వాల్యూ ఆయిల్స్, గ్యాస్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ చూసుకోనుంది. రైతులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేయడంతోపాటు, పండించిన పంటలను కూడా ఈ సంస్థనే కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌కు పంపనుంది.
70 శాతం దిగుబడులు విదేశాల నుంచే..
విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆహార పదార్థాల్లో ఆయిల్ వాటానే ఎక్కువగా ఉంది. మన దేశంలో ప్రస్తుతం సాగవుతున్న ఆయిల్ పామ్‌తో కేవలం 30 శాతం డిమాండ్ మాత్రమే తీరుతున్నది. మిగతా 70 శాతం నిల్వలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. దీంతో ప్రభుత్వం ఈ పంట సాగును పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నది.
రాయితీ ప్రోత్సాహకాలు
ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ఎకరాకు 50 నుంచి 57 మొక్కలు అవసరం ఉండగా ప్రస్తుతం వాటిని పూర్తి ఉచితంగా అందజేస్తున్నది. డ్రిప్ సిస్టమ్ కోసం బీసీలకు 90 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ ఇస్తున్నది. పన్నెండున్నర ఎకరాల వరకు రైతులు రాయితీలు పొందే అవకాశం ఉంది. పంట ఎదుగుదల కాలంలోనూ కొంత నగదును ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తున్నది.
ఎకరాకు రూ.2లక్షల ఆదాయం
నీరు నిలువని లోతైన ఒండ్రు నేలలు, అధిక సేంద్రియ పదార్థం కలిగి, నీరు తేలికగా ఇంకిపోయే గుణం కలిగి ఉండి, నీరు సమృద్ధిగా ఉన్న సారవంతమైన నేలల్లో ఆయిల్ పామ్స్ సాగు చేస్తే నాలుగేండ్ల నుంచి 30 ఏండ్ల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చు. నాలుగేండ్ల తర్వాత దిగుబడులు మొదలవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ ఆయిల్ పామ్ కాయలకు టన్నుకు 23 వేలకు పైగానే ధర ఉంది. ఈ లెక్కన ఎకరాకు రూ.2లక్షల ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. డ్రిప్ ద్వారా మొక్కలు ఎండిపోకుండా నీరు సమృద్ధిగా అందిస్తే దిగుబడులు మరింతగా వస్తాయంటున్నారు. మొదటి సంవత్సరం కొంత పెట్టుబడి కాగా.. రెండో సంవత్సరం నుంచి కాత వచ్చే వరకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. మూడేండ్ల వరకు మొక్కల మధ్య మొక్కజొన్న, మిరప, పూలు, పెసలు, మినుము, నువ్వులు, కూరగాయలను అంతరపంటగానూ సాగు చేసుకోవచ్చు. అకాల వర్షాలు, గాలి బీభత్సం వచ్చినా తోటలకు నష్టం ఉండదని, పశువులు, కోతులు కూడా పంటలను నష్టపర్చలేవని అధికారులు పేర్కొంటున్నారు.
ఆయిల్ పామ్ వైపుగా దృష్టి సారించాలి : సునంద, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
జిల్లా రైతులు ఆయిల్ పామ్ వైపు దృష్టిసారించాలి. ఈ పంట సాగు చేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ఈ పంట మన ప్రాంతానికి కొత్త అయినా ఇక్కడి వాతావరణం, భూములు అనుకూలంగా ఉన్నాయి. మొక్కలు నాటడం, సస్యరక్షణ చర్యలు, పంటల విక్రయాల వరకు ఉద్యాన శాఖ అండగా ఉంటుంది. ఆసక్తిగల రైతులు ఉద్యాన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి.