ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మాత్రం తీరడం లేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. పీఏసీఎస్‌లు, సహకార సంఘాలు, ఆగ్రోరైతు సేవా కేంద్రాల ఎదుట తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తున్నా అరకొరగా అం దుతున్న యూరియా పంటలకు సరిపోకపోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు.
షాద్‌నగర్ టౌన్, సెప్టెంబర్ 22 : షాద్‌నగర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం నరకయాతన పడ్డారు. అధికారులు పోలీసు పహారాలో ఎరువును పంపిణీ చేశారు. పీఏసీఎస్ వద్ద క్యూలైన్లను అటూ ఇటూ మార్చడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. పంటలు సాగు చేసి యూరియా కోసం నెల రోజులకుపైగా పడిగాపులు కాయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. రైతులు ఒకరినొక్కరూ తోసుకుంటూ యూరియా కోసం ఎగబడ్డారు.
ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా అందించాలని డిమాండ్ చేశారు. షాద్‌నగర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయంలో యూరియా పంపిణీని మండల వ్యవసాయాధికారి నిశాంత్‌కుమార్ పరిశీలించారు. పీఏసీఎస్ కార్యాలయానికి 900 బస్తాలు, కేశంపేట రోడ్డులోని ఆగ్రోరైతు సేవా కేంద్రానికి 450 బస్తాలు, ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్ద ఆగ్రోరైతు సేవా కేంద్రానికి 450 బస్తాలు.. మొత్తం 1800 బస్తాల యూరియా వచ్చిందన్నారు.
తాండూరులో యూరియా కోసం బారులు
తాండూరు, సెప్టెంబర్ 22 : నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ మండల కేంద్రాలకు రైతులు యూరియా కోసం భారీగా వచ్చి క్యూ పాడిగాపులు కాశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించినా చాలామందికి దొరక్కపోవడంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులు దాటినా ప్రభుత్వం అన్నదాతలకు సరిపడా యూరియాను అందించడంలేదని మండిపడ్డారు. పనులు మానుకుని రోడ్లపైకి వస్తున్నా సర్కార్ పట్టించుకోవడంలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతకాని తనంతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు.
అరకొర పంపిణీ
ధారూరు : మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు ఉదయం నుంచే నిరీక్షించారు. ఆధార్ కార్డు, పట్టాపాస్ బుక్కు చూపించిన రైతులకే అక్కడి సిబ్బంది యూరియా ఇస్తున్నా సరిపడా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు సంచుల ఎరువు పొలం మొత్తానికి సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సరిపడా అందించాలని కోరుతున్నారు.
రైతన్నల అసహనం
ఆమనగల్లు : మండల కేంద్రంలోని రైతు ఆగ్రో సేవా కేం ద్రం ఎదుట రైతులు ఉదయం నుంచే క్యూలో నిరీక్షించారు. ఉదయం 8 గంటల వరకు నిలబడిన సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు.
ఉదయం ఆరు గంటల నుంచే..
తాండూరు రూరల్ : రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా.. సంగం మందికే యూరియా లభిస్తున్నది. సోమవారం తాండూరు మండలంలోని ఎల్మకన్నె సహకార సంఘం ఎదుట రైతులు ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు క్యూలో ఉన్నారు. సహకార సం ఘానికి 20 టన్నులే రావడంతో క్యూలో ముందున్న రైతులకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేయగా.. వెనుక ఉన్న వారికి ఎరువు అందకపోవడంతో నిరాశతో వెళ్లారు.
రెండు బస్తాల చొప్పున పంపిణీ
నందిగామ : మండలంలోని చేగూరు సొసైటీకి యూరి యా వస్తుందనే సమాచారంతో అన్నదాతలు అధికంగా వచ్చి క్యూలో ఉన్నారు. లారీ యూరియా మాత్రమే రావడంతో ఒక్కో రైతుకు రెండు సంచుల చొప్పున పంపిణీ చేశారు. చాలామందికి యూరియా లభించకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. కాగా, ఎరువు తీసుకునేందుకు వచ్చి న రైతులకు పార్కింగ్ విషయంలో తోపులాట జరిగి గొడవకు దారి తీసింది. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు వారిని సముదాయించి పంపించారు.