తాండూరు రూరల్, డిసెంబర్ 26 : గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్ క్రైమ్ పెరుగుతున్నదని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా లోన్ యాప్స్, జాబ్ ఫ్రాడ్ తదితర నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. పోలీసు కళాబృందాలు వీటిపై అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు చెప్పారు. వికారాబాద్ జిల్లాలో రూ. 4.50 కోట్ల సైబర్ నేరాలు జరుగగా.. అందులో తాండూరు సర్కిల్ పరిధిలోనే రూ.1.16 కోట్ల వరకు ఉన్నట్లు వివరించారు.
తాండూరు సర్కిల్లో 2022 నుంచి 2024 వరకు నేరాల సంఖ్య తగ్గిందన్నారు. 2022లో గ్రీవెన్స్ కేసులు 21 నమోదు కాగా, 2023లో 18, 2024 లో 22 కేసులు నమోదైనట్లు వివరించారు. అదేవిధంగా హత్యలు 20 22లో 10, 2023లో 4, 2024లో 3, అత్యాచారాలు 2022లో 16, 2023లో 10, 2024లో 10 జరిగాయన్నారు. సర్కిల్ పరిధిలో మొత్తం కేసులు 2022లో 712 నమోదు కాగా, 2023లో 723, 2024లో 795 నమోదైనట్లు తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలించే ట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని వారిపై కఠినంగా ఉండాలన్నారు. అంతకుముందు ఆయన ఠాణాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆయనతోపాటు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేశ్ ఉన్నారు.