Ground Water | షాబాద్, మార్చి 10 : భూగర్భజలాలు అడుగంటడంతో బోరుబావుల్లో నీరు ఇంకిపోతుంది. దీంతో చేతికందే దశలో ఉన్న వరిపంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. అప్పులు చేసి కొత్తగా బోర్లు వేస్తున్నా, వ్యవసాయ బోరు బావుల్లో పూడికతీత పనులు చేస్తున్న లాభం లేకుండా పోతుంది. కొద్ది రోజుల్లోనే చేతికొస్తుందనుకున్న దశలో నీళ్లు సరిపోక పంటలు ఎండిపోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న వరి పైరు కళ్ల ముందే ఎండిపోతున్న అన్నదాతలు ఏమి చేయలేకపోతున్నారు. ఇందుకు సాక్ష్యం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో చేతికొచ్చిన వరిపంట ఎండిపోతున్న దృశ్యాలే. ఎండిన పంటను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇది ఒక్క షాబాద్ మండలంలోనే కాదు రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా అంతటా పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది.
ఎండుతున్న పంటలతో రైతుల కష్టాలు
యాసంగి సీజన్లో బోరుబావుల కింద సాగుచేసిన పంటలు నీళ్లు పారకపోవడంతో ఎండిపోతున్నాయి. ప్రధానంగా రైతులు వరిపంటను అత్యధికంగా సాగు చేస్తున్నారు. గత ఐదేళ్లుగా వానకాలం, ఎండకాలం వరిపంటను సాగు చేసుకుంటూ వస్తున్నారు. అప్పట్లో వర్షాలు సకాలంలో కురియడంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువులను మరమ్మతులు చేయడంతో భారీ వర్షాలకు చెరువులు నిండి అలుగులు పారి బోరుబావుల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. దీనికి తోడు కేసీఆర్ అందించిన 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, అదునుకు పెట్టుబడి సాయం అందడంతో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండేది. కానీ అందుకు విరుద్ధంగా గతేడాది వర్షాలు సరిగ్గా కురియకపోవడంతో పాటు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీనికి తోడు ప్రస్తుతం విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ఉన్న కొద్దిపాటి పంట కూడా నీళ్లు పారకపోవడంతో ఎండుముఖం పడుతుంది. ఆరుగాలం కష్టపడి సాగు చేసుకున్న వరిపంట కళ్ల ముందే ఎండిపోతుంటే రైతు కంట కన్నీరు వస్తుంది. ఇన్ని రోజుల నుండి రాని కరువు ఇప్పుడే రావాలా అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Paddy Crop
పశువుల మేతగా వరిపంట
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో వరిపంట పశువుల మేతగా మారింది. బోరుబావుల్లో నీరు తగ్గడంతో వేసిన వరిపంట ఎండిపోతుంది. దీంతో రైతులు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నారు. కుమ్మరిగూడ గ్రామానికి చెందిన పి. శేఖర్ అనే రైతు ఎకరం పొలంలో వరిపంట సాగు చేశారు. దానికోసం రూ.30వేల వరకు ఖర్చు చేశాడు. ఫిబ్రవరి వరకు పంటకు నీరు బాగానే అందింది. ఇంకో నెల రోజులైతే పంట చేతికొచ్చేది. కానీ నీరు అందకపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది. దీంతో రైతు ఆవేదన చెందుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో యువరైతు పి. కృష్ణయ్య తన ఎకరంన్నర పొలంలో వరితో పాటు పశుగ్రాసం సాగు చేశాడు. బోరులో నీరు పూర్తిగా అడుగంటడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. పంటకోసం ఇతడు కూడా రూ.25వేల వరకు ఖర్చు చేశాడు. చేతికొచ్చిన పంట ఎండిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పాడిఆవులను పంటను మేపుతూ, ఆవులకు మేతగా కోసి వేస్తున్నారు. ఈ గ్రామ రైతులే కాదు…ఇంకా చాలామంది రైతుల పంటలు ఎండిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
రోజురోజుకు అడుగంటుతున్న భూగర్భజలాలు
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రోజురోజుకు భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. బోరుబావుల కింద వేసిన పంటలన్ని ఎండిపోతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కరువులేకుండా పుష్కలంగా నీరు, కరెంట్ ఉండడంతో సంతోషంగా పంటలు పండించుకునేవాళ్లమని, మళ్లీ పదేళ్ల తర్వాత రైతులు కరువుతో అల్లాడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు. సాగునీటి కోసం రైతులు కొత్తగా బోర్లు వేస్తున్న ఫలితం లేకుండా పోతుంది. ఒక్కో రైతు రూ.1లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఖర్చు చేసి 600 నుండి 800 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తున్న చుక్కా నీరు రావడం లేదు. దీంతో చేసిన అప్పులు ఏలా తీర్చాలో అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతులకు పరిహారం ప్రకటించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.