ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యుత్తు సరఫరా సమయానికి చేయకపోవడంతో పంటలకు నీరు సరిగా అందడంలేదు. భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రోజురోజుకూ ఎండలు ముదురుతుండటంతో బోర్లు అడుగంటిపోతున్నాయి. సరిపడా నీళ్లు పడకపోవడంతో వరిచేన్లు ఎండిపోతున్నాయి. ఆరుగాలం శ్రమించిన కష్టం వృథా అవుతున్నదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. నీళ్లు లేక వరి చేను ఎండిపోతుండటంతో పశువులను మేపుతున్నామని వాపోతున్నారు. వరి చేను కాపాడుకుందామని బోర్లు వేసినా ఫలితం లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు ఉంటే పంట చేతికంది పెట్టుబడి వచ్చేదంటున్నారు. మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగం చేస్తున్నది. పెట్టుబడి సాయం ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదు. బీఆర్ఎస్ పాలనలో పంట సాగుకు ముందే డబ్బులు వస్తుండేవి. సంతోషంతో పంటలు పండించుకునేవాళ్లం. ఇప్పుడు ఇలా నీళ్లు లేక వరి పంటలు ఎండిపోతున్నా ఏ ఒక్క అధికారి, పాలకుడు రైతులను పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎండిన పొలాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండుతుండటంతో భూగర్భజలాలు అడుగంటాయి. బోరుబావిలో చుక్క నీరు లేక చేతికి వస్తున్న మా వరి పంట ఎండిపోతున్నది. పొట్టదశలో ఉన్న చేతికి వచ్చిన వరి నీళ్లు లేక కళ్ల ముందే ఎండిపోతున్న ఏమీ చేయలేకపోయా. అనారోగ్యంతో మా నాన్న ఇటీవలే మరణించాడు. ఇంటి భారం నాపై పడింది. ఉన్న పొలంలో మంచిగా వ్యవసాయం చేసుకుందామనుకుంటే వరి చేను పోయింది. ఇప్పుడు ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. ఈ బాధతో బుక్క బువ్వ నోట్లోకి పోవడంలేదు. అప్పులు చేసి పంట సాగు చేశా. ఇప్పుడు ఇలా పంటను చూస్తే చాలా భయమేస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో సంతోషంతో పంటలు పండించుకునే వాళ్లం. ఇప్పుడు ఇలా నీళ్లు లేక వరి పంటలు ఎండిపోతున్నా ఏ ఒక్క అధికారి, పాలకుడు రైతులను పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎండిన పొలాలను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలి.
– నరేందర్, రైతు, జక్కెపల్లి, తాండూరు
యాచారం : మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన తలారి రవి తనకున్న రెండెకరాల పొలంలో యాసంగిలో వరిపంట సాగు చేశాడు. మండలంలో ఇటీవల ఒక్కసారిగా కరువు ఛాయలు అలుముకోవడంతో పంట చేనుకు నీళ్లు లేక ఎండిపోయింది. తన పొలంలో ఉన్న రెండు బోర్లు ఇటీవలే అడుగంటడంతో సాగునీటి ఎద్దడి నెలకొన్నది. పైగా కరెంటు సరఫరాలో నిర్లక్ష్యం, లో వోల్టేజీ సమస్య అన్ని వెరసి వరి పంట పూర్తిగా ఎండిపోయింది. మరో నెల రోజుల్లో పంట చేతికొచ్చే దశలో పంట ఎండిపోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నీళ్లు లేక కండ్ల ముందే వరిపంట ఎండిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. ఇన్ని రోజుల కష్టం, పెట్టుబడి, సమయం పంట ఎండిపోవడంతో వృథాగా పోతున్నదని విచారం వ్యక్తం చేస్తున్నాడు. పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట చేతికొచ్చే దశలో చేజారిపోయిందనే బాధను ఆయన వెళ్లగక్కాడు.
గత పదేళ్లలో ఇంతటి కరువు రాలేదని పేర్కొంటున్నాడు. నీళ్లు లేక ఎండిపోయిన పంటను పశువులకు మేపనున్నట్లు ఆయన తెలిపాడు. పంటలెండుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పంటల వైపు కన్నెత్తికూడా చూడటంలేదని పేర్కొన్నాడు. ఎండిపోయిన పంటలను గుర్తించి, పంటలెండిపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నాడు. లేదంటే ఆందోళనలు తప్పవని ఆయన హెచ్చరిస్తున్నాడు.
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతులకు ప్రస్తుతం కన్నీరే మిగులుతున్నది. ముందెన్నడూ ఇంతలా రాని కరువు ఇప్పుడే వచ్చింది. మా బతుకులు ఆగమవుతున్నాయి. నా మూడెకరాల పొలంలో వరి పంట వేశాను. పంట చేతికివస్తుందన్న సమయంలోనే బోరుబావి అడుగంటడంతో నీళ్లు రావడంలేదు. దీంతో మండుతున్న ఎండకు వరి చేను పూర్తిగా ఎండిపోయింది. ఇక దిక్కుతోచక 3 ఎకరాల వరి పంటను పశువులకు మేతగా వదిలేశా. రూ.లక్ష వరకు ఖర్చుపెట్టి పంటసాగు చేసిన. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఇచ్చినట్టు కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్రెడ్డి పెట్టుబడి సాయం ఇస్తాడనుకున్నాం. అప్పుతెచ్చి పంటలు వేసిన. ఇలా పంట ఎండిపోవడంతో నాకేమీ తోచడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న పెట్టుబడి సాయం (రైతు భరోసా) ఇంకా అందలేదు. ఆ డబ్బులన్నా వస్తే కాస్త బాగుండేది. రాష్ట్రంలో రైతుల బాధలు తీరాలంటే మళ్లీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్రెడ్డి నెరవేర్చని హామీలను ఇస్తూ రైతులను, ప్రజలందరినీ మోసం చేస్తున్నడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుతో వ్యవసాయం పండుగలా చేసుకున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో చాలా ఇబ్బందిగా మారింది. వెంటనే ఎండిన పంటలను పరిశీలించి రైతులను ఆదుకోవాలి.
– సిన్యానాయక్, రైతు, మకుందాపూర్, తాండూరు
కడ్తాల్ గ్రామంలో నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది. నాకున్న ఒక్క బోరుతో ఎకరా పొలంలో వరి పంట సాగు చేశాను. బోరులో రోజురోజుకూ నీళ్లు తగ్గిపోతుండటంతో వరి చేను ఎండిపోయే స్థితికి వచ్చింది. వరి పంటను కాపాడుకునేందుకు పదిహేను రోజుల క్రితం రూ.90 వేలు అప్పు చేసి రెండు బోర్లు వేయిస్తే చుక్క నీరూ పడలేదు. నీరందక కండ్ల ముందే పంట ఎండిపోతున్నది. పంట సాగు కోసం అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడంలేదు. ఇంత కరువు గతంలో ఎప్పుడూ చూడలేదు.
– కోశిక అంజయ్య, కడ్తాల్ మండలం
రావిచేడ్ గ్రామంలోని రెండు ఎకరాల భూమిలో వరి పంట సాగు చేశాను. పంట పొట్ట దశకు వచ్చేసరికి బోర్లలో నీళ్లు అడుగంటాయి. నీరందక చేతికంది వచ్చే పంట ఎండిపోతున్నది. పొలమంతా ఎండిపోయి బీటలుగా మారిపోయింది. వరి చేనును చూస్తే ఏడుపు వస్తున్నది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. చేసేదేమీ లేక పశువులను మేపుతున్నాను. ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
– రామచంద్రయ్య, కడ్తాల్ మండలం