వికారాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా గత రెండు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నది. కులకచర్ల, మోమిన్‌పేట, తాండూరు, బషీరాబాద్, యాలాల, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో 100 మి.మీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. జిల్లాలో పంటలు నీటమునగగా, పలు మండలాల్లో ఇండ్లు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులు, భారీ వర్షంతో పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తమను ఆదుకోవాలని ఇండ్లు దెబ్బతిన్న బాధితులతోపాటు పంట నష్టపోయిన రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మాత్రం పర్యటించకపోగా. తాండూరు ఎమ్మెల్యే వరద ప్రభావం తగ్గిన తర్వాత ఆయా కాలనీల్లో పర్యటించడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
1056 ఎకరాల్లో పంట నష్టం..
జిల్లాలో కురిసిన భారీ వర్షానికి అపార పంట నష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా 1056 ఎకరాల్లో ఆయా పంటలకు నష్టం వాటిల్లింది. ఎక్కువగా దౌల్తాబాద్, కొడంగల్, వికారాబాద్, ధారూరు, నవాబుపేట మండలాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. పత్తి, మొక్కజొన్న, కంది పంటలే అధికంగా దెబ్బతిన్నాయి. కొడంగల్ మండలంలో వరి-46 ఎకరాలు, పత్తి-79 ఎకరాలు, కందులు-32 ఎకరాల్లో నష్టం జరిగింది. ధారూరు మండలంలో పత్తి-244 ఎకరాలు, మొక్కజొన్న-45 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. వికారాబాద్ మండలంలో వరి-32 ఎకరాలు, పత్తి-298 ఎకరాలు, మొక్కజొన్న-21 ఎకరాలు, పసుపు-40 ఎకరాలు, కందులు-34 ఎకరాల్లో నష్టం జరిగింది. నవాబుపేట మండలంలో పత్తి-50 ఎకరాలు, దౌల్తాబాద్ మండలంలో 52 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. పంట పొలాల్లో నిలిచిన నీటితోనూ పంటలకు నష్టం జరిగే అవకాశాలున్న దృష్ట్యా జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం అప్రమత్తమై రైతులకు సలహాలు, సూచనలు అందజేస్తున్నది.
దెబ్బతిన్న 34 ఇండ్లు..
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని పలు చోట్ల ఇండ్లు దెబ్బతిన్నాయి. ఎడతెరిపిలేకుండా రెండు రోజులుగా కురిసిన వర్షానికి జిల్లావ్యాప్తంగా 34 ఇండ్లు దెబ్బతిన్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. వీటిలో వికారాబాద్ రెవెన్యూ డివిజన్లో 18 ఇండ్లు, తాండూరు రెవెన్యూ డివిజన్లో పలు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కతేల్చారు. మండలాల వారీగా పరిశీలిస్తే తాండూరు మండలంలో 2 ఇండ్లు, బొంరాస్‌పేట మండలలో 2 ఇండ్లు, దుద్యాల మండలంలో 2 ఇండ్లు, యాలాల మండలంలో 3 ఇండ్లు, దౌల్తాబాద్ మండలంలో 6 ఇండ్లు, పెద్దేముల్ మండలంలో ఒక ఇల్లు, వికారాబాద్ మండలంలో 6 ఇండ్లు, మోమిన్‌పేట మండలంలో 4 ఇండ్లు, మర్పల్లి మండలంలో 3 ఇండ్లు, పరిగి మండలంలో 5 ఇండ్లు వర్షానికి పాక్షికంగా దెబ్బతిన్నాయి.