వికారాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో సోషల్ ఆడిట్ పేరు వింటేనే సంబంధిత ఉద్యోగులు జంకుతున్నారు. ఆడిట్ నిర్వహిస్తే ఈజీఎస్ పనుల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఏ మండలంలో సోషల్ ఆడిట్ నిర్వహించినా తప్పనిసరి నిబంధన ఒకటి పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ముట్టజెప్పాలని ఆదేశిస్తుండడంతో చిన్నపాటి ఉద్యోగాలను వదులుకోలేక ఆపసోపాలు పడుతున్న ఈజీఎస్ ఉద్యోగులు అప్పులు చేసి మరీ ముట్టజెప్పుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
సోషల్ ఆడిట్లో ఏడాది మొత్తంగా ఈజీఎస్ పథకంలో చేసిన పనుల్లో అవకతవకలు ఏమైనా జరిగాయా అనే విషయాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అధికారులే వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ ఆడిట్ జరిగితే ఈజీఎస్ పనుల్లో జరిగిన అవకతవకలు వెలుగులోకి రావడమేమో కానీ సోషల్ ఆడిట్ ఖర్చుతో కూడుకున్న పనైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగే అవకతవకల నిగ్గు తేల్చేందుకుగాను ఏడాదికోసారి సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు.
ఈ సోషల్ ఆడిట్లో ఎంత మేర ఈజీఎస్ పనులు పూర్తి చేశారు, చెల్లించిన కూలీ డబ్బులు తదితర వివరాలను గ్రామపంచాయతీలో అందరి సమక్షంలోనే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి తనిఖీలు చేపడుతారు. ప్రతీ మండలంలో ఒక్కో రోజు తేదీని నిర్ణయించి ఈజీఎస్ పనులపై సామాజిక తనిఖీలు చేస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లాలో సోషల్ ఆడిట్ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని ఈజీఎస్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా శాఖను గాడిలో పెట్టాల్సిన అధికారిపైనే వసూళ్ల ఆరోపణలు రావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి తీరుపై సొంత శాఖ ఉద్యోగులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ డీఆర్డీవో వ్యవహరించని విధంగా ప్రస్తుత డీఆర్డీవో తీరు ఉందని ఉద్యోగులు మండిపడుతున్నారు. తాము చిన్న ఉద్యోగులం, వచ్చే జీతంలో కుటుంబాన్ని నెట్టుకురావడమే సరిపోతుంది కానీ సోషల్ ఆడిట్ జరిగిన ఏడాదికోసారి రూ.లక్ష వరకు ముట్టజెప్పాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ ఆడిట్ ఏ మండలంలో ఏ తేదీన జరుగనున్నదో తెలిపి.. ముందే డీఆర్డీవోకు సంబంధించి కోటరీ వర్గం ఆయా మండలాలకు సంబంధించిన ఈజీఎస్ ఉద్యోగులకు ‘సార్ వస్తున్నారు సెట్ చేసుకోండని’ ముందే చెబుతారన్న ఆరోపణలున్నాయి. డీఆర్డీవో కార్యాలయంలోనూ కొందరిని ఆయన కోటరీగా మార్చుకొని వారితోనే అంతా కానిస్తున్నట్లు ఆ శాఖ ఉద్యోగుల్లో ప్రచారం జరుగుతున్నది. మరోవైపు సబ్సిడీ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలోనూ అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
లేని కంపెనీలను ఏర్పాటు చేసినట్లుగా బోగస్ పేపర్లు, బిల్లులు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే ఒకరిద్దరు డీపీఎంలు చేసే ఈ అక్రమాలను చూసీచూడనట్లుగా ఉంటూ, తిలా పాపం తలా పిడికెడు అన్న మాదిరిగా నడుస్తున్నదని జోరుగా ప్రచారం జరుగుతున్నది.