ఇబ్రహీంపట్నం : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ సైదులు కథనం ప్రకారం.. మంచాల మండలం బండాలేమూర్ గ్రామానికి చెందిన జోగు అశోక్(42) వృత్తిరీత్య కూలీ పనిచేసుకుంటూ కుటుంబసభ్యులతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. గత రెండు, మూడు రోజులుగా ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతుండటంతో మనస్థాపానికి గురై ప్రతిరోజు మాదిరిగానే బుధవారం ఉదయం కూలి పనికి వెల్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో తెలిసిన వాళ్ల ఇండ్లలో వెతికారు. అయితే, గురువారం వెతికే క్రమంలో అతని బంధువు వెంకటేష్ అనే వ్యక్తికి గురువారం ఉదయం ఇబ్రహీంపట్నం రాయపోల్రోడ్డులోని వెంకటేశ్వర వెంచర్ సమీపంలో ఓ చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు.
వెంటనే కుటుంబసభ్యులకు ఆయన సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు వేలాడుతున్న అశోక్‌ను కిందకు దించారు. అప్పటికే అశోక్ మృతిచెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.