వికారాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): జిల్లాలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నా.. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఫర్టిలైజర్ డీలర్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది. ఇతర జిల్లాల్లో పత్తి విత్తనాల కొరత ఉన్న దృష్ట్యా జిల్లా ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లా రైతాంగం ఇబ్బందులు పడకుండా అవసరం మేర పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచారు. రేవంత్ లాంటి కొన్ని పత్తి విత్తనాల కంపెనీలకు సంబంధించి అధిక దిగుబడి వస్తుందంటూ కావాలనే ప్రచారం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుండడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది.
పత్తి విత్తనాలకు సంబంధించి ప్రచారాన్ని నమ్మి ఇబ్బందులు పడకుండా ఏ కంపెనీ పత్తి విత్తనాలతో సాగు చేసినప్పటికీ దిగుబడి ఒకేలా వస్తుందని, సాగును బట్టి దిగుబడిలో మార్పు ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని రైతులకు తెలిసేలా జిల్లావ్యాప్తంగా వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కృత్రిమ డిమాండ్‌ను కల్పించిన రేవంత్ పత్తి విత్తనాలకు సంబంధించి జిల్లాలో ఏ డీలర్ కూడా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకుగాను జిల్లాకు ఆనుకొని ఉన్న కర్ణాటక సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.
జిల్లాలోని ఫర్ట్టిలైజర్స్ దుకాణాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల బారిన పడి రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలను జిల్లా ఉన్నతాధికారులు చేపట్టారు. మరోవైపు పత్తితోపాటు ఇతర పంటలను సాగు చేసే రైతులు వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్సు పొందిన డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కొందరు నకిలీ పత్తి విత్తనాలను రైతులకు నేరుగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని, రైతులెవరూ కొనుగోలు చేయవద్దని, మరోవైపు నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకుగాను జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు నిఘా పెట్టింది.
అందుబాటులో 2,55,067

జిల్లాలో సరిపోను పత్తి విత్తనాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పత్తి విత్తనాల విషయంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు స్టాక్ చూసుకుంటూ అవసరం మేర పత్తి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లాలో వానకాలం సీజన్లో 5,45,000 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. జిల్లాకు ఇప్పటివరకు 3,14,525 ప్యాకెట్ల పత్తి విత్తనాల స్టాక్ జిల్లాకు ప్రభుత్వం సరఫరా చేయగా, ఇప్పటివరకు జిల్లా రైతాంగం 59,458 పత్తి విత్తనాల ప్యాకెట్లను కొనుగోలు చేసింది.
మరో 2,55,067 పత్తి విత్తనాల ప్యాకెట్లు జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వరికి సంబంధించి 27,500 క్వింటాళ్ల విత్తనాలు, మొక్కజొన్న 4036 క్వింటాళ్లు, పెసర్లు-1040, కందులు-4500 క్వింటాళ్లు, మినుములు-400 క్వింటాళ్లు, సోయాబీన్-750 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఈ వానకాలం సీజన్‌కుగాను జిల్లా వ్యవసాయాధికారులు రూపొందించిన సాగు ప్రణాళికకు సరిపడా ఎరువులను కూడా అందుబాటులో ఉంచేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో పీఏసీఎస్, డీలర్లు, కంపెనీ గోదాంలు, మార్క్‌ఫెడ్, వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే ఎరువులను సరఫరా చేసేందుకు నిర్ణయించారు.
వానకాలం సీజన్‌కుగాను యూరియా, డీఏపీ, ఎన్పీకేఎస్, ఎంవోపీ, ఎస్ఎస్పీ ఎరువులు అన్ని కలిపి 75,437 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా యూరియా 32,329 మెట్రిక్ టన్నులు, డీఏపీ 17,719 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 19,877 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 3658 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 1854 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని సంబంధిత అధికారులు అంచనా వేయగా, జిల్లాలో ఇప్పటివరకు యూరియా 15,317 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1273 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2477 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 192 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 106 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలోని గోదాముల్లో నిల్వ ఉంచారు.
వానకాలం సీజన్లో
జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 5.97 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. పత్తి 2,63,500 ఎకరాలు, కంది 1.50 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 50,450 ఎకరాలు, వరి 1.10 లక్షల ఎకరాలు, మినుములు 5 వేల ఎకరాలు, సోయాబీన్ 2500 ఎకరాలు, జొన్నలు-2500 ఎకరాలు, పెసలు 13 వేల ఎకరాల్లో సాగవుతుందని ప్రణాళికను రూపొందించారు. గతేడాది వానకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 5.81 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగుకాగా, వరి-1,34,857 ఎకరాలు, మొక్కజొన్న-55,751, జొన్న-2033 ఎకరాలు, కందులు-1,31,284 ఎకరాలు, పెసలు-13,453 ఎకరాలు, మినుములు-5175 ఎకరాలు, పత్తి-2,30,285 ఎకరాల్లో రైతులు సాగు చేశారు.
వానకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో సరిపోను పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచాం. ఎలాంటి కొరత లేదు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకుగాను తగు చర్యలు తీసుకున్నాం. నకిలీ విత్తనాలపై రైతులు కూడా అవగాహన పెంచుకోవాలి. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తాం. రైతులు కొనుగోలు చేసే విత్తనాలకు సంబంధించి ప్రతీ ఒక్కరూ రసీదులు తీసుకోవాలి.
– నారాయణరెడ్డి, వికారాబాద్ కలెక్టర్