రంగారెడ్డి, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతున్నది. డీఈవో కార్యాలయంలో ఏ చిన్న పనికైనా లంచాలు తీసుకుంటున్నారని ..ఇందుకోసం ప్రత్యేకంగా వింగ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లావిద్యాశాఖ కార్యాలయంలో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతున్నదని కొంతమంది ఎంఈవోలు డీఈవో కార్యాలయం లో డిప్యుటేషన్‌పై పనిచేస్తూ ప్రతి పనికీ లంచాలు తీసుకుంటు న్నారని.. వారిపై సమగ్ర విచారణ జరిపించాలని ఫిబ్రవరి 4న తెలంగాణ బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్‌గౌడ్ ఏసీబీ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుచేసి 20 రోజులు గడవకముందే ఆ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీధర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ, బీసీబీ జాంతే నహీ తమ పని తాము చేసుకుంటూ వెళ్తామని ఏకంగా ఏసీబీకే సవాల్ విసిరారనే ఆరోపణలున్నాయి.
డీఈవో కార్యాలయంలో జరిగే ప్రతి పనికీ ఇంత మొత్తం చెల్లించాలని ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయుల డిప్యుటేషన్‌పై బదిలీలు.. ప్రైవేట్ పాఠశాలల స్థాయి పెంచడం, కొత్తగా ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులివ్వడం.. పరీక్ష సెంటర్ల కేటాయింపు, ఇతర బిల్లుల మంజూరుకు ఫైలుకో రేటు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. డీఈవో కార్యాలయంలో ఎంఈవోలు డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు.
వీరే కిందిస్థాయి నుంచి వచ్చే ఫైళ్ల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా పరిధిలో అనేక కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలున్నాయి. అలాగే, కొత్తగా ఏర్పాటయ్యే ప్రైవేట్ పాఠశాలలు కూడా నిబంధనలకు విరుద్ధ్దంగా కొనసాగుతున్నాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలల ఏర్పాటుకు అవసరమైన గదులు, ప్లేగ్రౌండ్, అనుభవజులైన ఉపాధ్యాయులు, ఫైర్‌సేప్టీ వంటి వసతులుండాలి. కానీ, ఇవేం లేకుండానే లంచాలు తీసుకుని అనుమతులు జారీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
జిల్లాలో అనేక ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఫీజులను అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలల పేరుతో లక్షలాది రూపాయల ఫీజుతోపాటు డొనేషన్లు వసూలు చేస్తున్నారు. అలాగే, పాఠశాలల్లోనే నోటుపుస్తకాలు, పాఠ్యపుస్తకాలు వంటివి అధిక ధరలకు అమ్ముతు న్నారు. ఇలాంటి వాటిపై నిఘా పెట్టాల్సిన విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలున్నాయి.
డీఈవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీధర్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని ఇటీవల కొందరు ఏసీబీ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో దృష్టి సారించిన ఏసీబీ అధికారులకు డీఈవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ మొయినాబాద్ మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు సీబీఎస్సీ సిలబస్‌తో ఏర్పాటు చేసే పాఠశాలకు ఎన్వోసీ జారీ విషయంలో పాఠశాల యాజమాన్యం నుంచి రూ. 70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో ఆ కార్యాలయంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో శ్రీధర్ పట్టుబడటంతో బట్టబయలైంది.