న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఎన్నో పరిశ్రమలను, మరెన్నో రంగాలను కుదేలు చేస్తున్నది. ఇండ్ల దగ్గర్నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్దాకా ఖరీదెక్కుతున్నాయి. సస్పెన్షన్ గ్రేడ్ పాలీవినైల్ క్లోరైడ్ (ఎస్-పీవీసీ) ముడి సరుకు దిగుమతులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) కనీస దిగుమతి ధర (ఎంఐపీ) నిబంధనను విధించింది. దీంతో వాటర్ పైపులు, ఇతర ప్లంబింగ్ ఫిట్టింగ్స్, విద్యుత్తు కేబుల్స్ తయారీ ఖర్చులు పెరిగిపోనున్నాయి. వీటన్నిటి తయారీకి ఎస్-పీవీసీ ముడి సరుకే ఆధారం మరి.
ఇదీ సంగతి..
గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వివరాల ప్రకారం.. డీజీఎఫ్టీ ఇటీవలి నోటిఫికేషన్‌తో ఎస్-పీవీసీ ముడి సరుకు పదార్థాల దిగుమతులు ఉచితం నుంచి ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. ధర, బీమా, రవాణా విలువతో కలిపి కిలో 0.766 డాలర్లు (ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రకారం రూ.73.39) లేదా అంతకంటే తక్కువగా ఉన్న పీవీసీ ముడి సరుకు దిగుమతులకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. దీంతో ఈ దిగుమతులకు ఇకపై కస్టమ్స్ సుంకాలుంటాయి. అలాగే డీజీఎఫ్టీ నుంచి లైసెన్స్ కూడా తప్పనిసరి. అయితే కిలో విలువ 0.766 డాలర్లకు మించి ఉన్న సరుకు దిగుమతులు ఎప్పట్లాగే ఉచితం. ఈ నిబంధనలు వచ్చే 6 నెలలపాటు అమల్లో ఉంటాయి. ఈ క్రమంలో ఇంటి నిర్మాణ వ్యయాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఖర్చులు పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇండ్లలో వాడే వాటర్ సైప్లె పైపులు, ఇతర ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్ తయారీకి డీజీఎఫ్టీ పెట్టిన పరిమితి లోపున్న ఈ పీవీసీ ముడి సరుకునే ఎక్కువగా వినియోగిస్తున్నారు.
బడా కంపెనీలకు లాభం
కేంద్రం తెచ్చిన నిబంధనలతో రిలయన్స్ ఇండస్ట్రీస్, కెమ్‌ప్లాస్ట్ సన్మార్, డీసీఎం శ్రీరామ్ వంటి దేశీయంగా ఉన్న బడా పీవీసీ ముడి సరుకు తయారీదారులకే లాభమని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. పెరిగే డిమాండ్‌కు తగ్గట్టు ఆయా కంపెనీలు ధరలు పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే పీవీసీ పైపులను ఎక్కువగా వాడే వ్యవసాయం, నిర్మాణ, మౌలిక రంగాలకు దెబ్బేనని హెచ్చరిస్తున్నారు.
ఎంఎస్ఎంఈలకు నష్టం
పీవీసీ పైపులు, ఫిట్టింగ్స్, కేబుల్స్, స్ప్రింగ్ పైప్స్, ఫిల్మ్స్, పాదరక్షలు, వైద్య ఉత్పత్తులు తదితరాలను తయారు చేసే ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ నిర్ణయం ప్రధానంగా నష్టాన్ని కలిగిస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ముడి సరుకు వ్యయం భారంగా మారుతుందని అంటున్నారు. చివరకు ఆయా ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వస్తుందని, అది అంతిమంగా వినియోగదారులకే దెబ్బని వివరిస్తున్నారు. నిజానికి చౌకగా విదేశాల నుంచి దేశీయ మార్కెట్లోకి వస్తున్న ఈ పీవీసీ ముడి సరుకుతో స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న సంస్థలు నష్టపోతున్నాయని, వారికి మద్దతు ఇచ్చేందుకు, ధరల స్థిరీకరణ, నాణ్యమైన ఉత్పత్తులను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం వివరిస్తున్నది. అయితే ఈ ఆంక్షలతో దిగుమతులు తగ్గకపోగా, అదనపు భారం వల్ల ఆయా ఉత్పత్తుల ధరలు దేశీయ మార్కెట్లో పెరిగి వినియోగదారులే నష్టపోయే అవకాశాలున్నాయని జీటీఆర్ఐ అంటున్నది. దేశీయ డిమాండ్‌కు తగ్గ పీవీసీ ముడి సరుకు స్థానికంగా ఉత్పత్తి కాలేకపోతుండటమే ఇందుకు కారణమని చెప్తున్నది.