బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో జనజీవనం స్తంభించింది. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సగటున 82.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిర్మల్ అర్బన్ మండలంలో 132.3, కడెం పెద్దూర్లో 131.2, సోన్‌లో 130.3, మామడలో 115.8, నిర్మల్ రూరల్‌లో 110.6 మి.మీ. వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో సగటున 80.6 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాసిపేట మండలంలో 123.5, హాజీపూర్‌లో 107.4, మందమర్రి, చెన్నూర్ మండలాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా పడింది. ఆదిలాబాద్ జిల్లాలో సగటు 52.2, ఆసిఫాబాద్ జిల్లాలో 40.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంద్రవెల్లిలో అత్యధికంగా 91.3, బోథ్‌లో 84.8, తిర్యాణిలో 107.4, లింగాపూర్‌లో 96.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగడం, పలుచోట్ల లో లెవల్ వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచాయి.

మంచిర్యాల, జూలై 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వట్టివాగు ప్రాజెక్ట్ పూర్తిగా నిండింది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లింగాపూర్, సిర్పూర్(యూ) మండలాల్లో పలుచోట్ల లో-లెవల్ వంతెనల పైనుంచి భారీ వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచాయి. తిర్యాణి మండలంలోని గుండాల, చింతల మధుర, ఉల్లిపిట్ట జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. చెలిమవాగు ప్రాజెక్ట్ మత్తడిపోస్తున్నది.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో మల్లంపేట-నక్కలపల్లి మధ్యలో గల వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచాయి. ఆలుగామ గ్రామంలో ఇల్లు కూలి పడడంతో నలుగురికి గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు ఉప్పొంగింది. దండేపల్లి మండలంలోని మాదాపూర్-నర్సాపూర్ లో-లెవల్ వంతెనపై నుంచి వరద నీరు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచా యి. కాసిపేట మండలంలోని కోనూర్, కొండాపూర్ యాప బ్రిడ్జిపై నుంచి వాగు ప్రవహిస్తుండడంతో ఆ రహదారిని మూసివేశారు. జన్నారం మండలం లోని రోటిగూడ, పోనకల్, మహ్మదాబాద్ వాగులు పొంగి ప్రవహించాయి. తాండూర్ నర్సాపూర్ వాగు, చెన్నూర్ మండలంలో ఆకేపల్లి వాగు, జైపూర్ మండలంలో టేకుమట్ల వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం పరవళ్లు తొక్కింది. ఉట్నూర్ మండలంలో గల నర్సాపూర్(జే), వంకతుమ్మ వాగులు వరద నీటి ప్రవాహం పెగింది. మండల కేంద్రానికి రాకపోకలు నిలిచాయి. చేలలో నీరు నిలిచింది. నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో నూతనంగా నిర్మించిన ప్రహరీ కూలింది. ఎంపీడీవో పూల్లారావు పాఠశాలకు వెళ్లి పరిశీలిం చారు. భీంపూర్ మండలంలోని గుంజాల సమీపంలో గల గుండాల జలపాతం జాలువారుతున్నది. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న గ్రంథాలయంలోకి వరద నీరు చేరింది. భవనం పైకప్పు రేకులు పగిలిపోవడంతో వర్షపు నీరు కారుతుండడంతోపాటు తలుపులు, కిటికిల నుంచి వర్షపు నీరు లోపలకు చేరడంతో విలువైన పుస్తకాలు తడిసి పోయాయి.
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం మండలంలోని ధర్మాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కుర్రగూడ, పాత రేవుజీపేట గ్రామాల మధ్యలోని అప్రో చ్ వంతెన కొట్టుకుపోయింది. మూడేళ్ల క్రితం వరదల కు వంతెన కొట్టుకుపోగా స్థానికులు అప్రోచ్ వంతెన వేసుకున్నారు. ఈ వర్షాలకు ఆ వంతెన కొట్టుకుపో వడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లక్ష్మణచాంద మండలంలోని పీచర ధర్మారం నుంచి సోన్‌కు వెళ్లే రోడ్డు భారీ వర్షానికి కొట్టుకుపోయింది. ఖానాపూ ర్ మండలంలోని మేడం పల్లి గ్రామ సమీపంలో ఉన్న సదర్మాట్ ఆనకట్టకు గత రెండు రోజు లుగా కురుస్తున్న వర్షాలతో జలకళ సంతరించుకుంది.
ఖానా పూర్ మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్ప డింది. సుభాష్నగర్కాలనీ సమీపంలోని హైటెక్ సిటీ కాలనీలోకి వెళ్లడానికి ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద నీరు పోటెత్తడంతో తెగింది. పోలీసు లు బారీకేడ్లు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టారు. కడెం ప్రాజెక్టును విద్యుత్ శాఖ ఎస్ఈ సుభాష్ సందర్శించారు. సీఈ జగదీష్, ఎస్ఈ రాజేంద్రప్రసాద్‌లు కూడా పరిశీలించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే స్పందించేలా అన్ని ఏర్పాట్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. వారి వెంట ఈఈ ప్రవీణ్కూమర్, జేఈ మురళి ఉన్నారు.దస్తురాబాద్ మండలంలోని గ్రామాల్లో సర్పంచ్‌లు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డప్పు చాటింపు చేయించారు.పెంబి మండలంలోని మెరుని పరుపు చెక్‌డ్యామ్ అలుగు దుంకుతున్నది.

జౌళినాల షట్టర్ మొరాయింపు
సారంగాపూర్, జూలై 29 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో బుధవారం స్వల్పంగా వదర నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1183.8 అడుగులకు 1173 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు కెపాసిటి మొత్తం 1.037 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.331 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లా 1296 క్యూసెక్యుల నీరు చేరగా అవుట్‌ఫ్లో మాత్రం లేదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
జౌళినాల షట్టర్ మొరాయింపు
స్వర్ణ ప్రాజెక్టు పరిధిలోని జౌళినాల షట్టర్ మొరాయించడంతో నీరు వృథాగా పోతుందని రైతులు అంటున్నారు. ఆరు నెలల నుంచి షట్టర్ పని చేయకపోవడంతో కిందికి, పైకి దిగకపోవడంతో విలువైన వరద నీరు బయటికి వెళ్లిపోవడంతో సాగుకు కష్టంగా మారుతుందని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. షట్టర్‌కు మరమ్మతు చేయకపోతే ఆయకట్టు రైతులకు తీవ్రనష్టం జరుగుతుంది. అధికారులు వెంటనే మరమ్మతు లు చేపట్టి ఉపయోగంలోకి తేవాలని రైతులు కోరుతున్నారు.
