హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : బిగ్ బ్రదర్స్ భూ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న చందంగా అధికారం ఉండగానే అందినకాడికి దోచుకోవాలని చూస్తున్నారు. నిన్నటికి నిన్న మాదాపూర్‌లో లక్కీ రెస్టారెంట్‌ను అప్పగించాలంటూ మన్సూర్, రెహానాలకు ధమ్కీ ఇచ్చిన బిగ్ బ్రదర్స్.. ఇప్పుడు ఖానామెట్‌లో రూ.100కోట్ల విలువైన సర్కార్ భూములపై కన్నేశారు. అనుచరులను రంగంలోకి దింపి చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మించారు.
గతంలో హెచ్ఎండీఏ ఏర్పాటుచేసిన హద్దు దిమ్మెలనూ కూల్చేసి దర్జాగా పనులు చేస్తున్నారు. ఇది కేవలం పైలట్ ప్రాజెక్టు మాత్రమే. ఎందుకంటే.. అక్కడ ఇంకా ఎకరాలకొద్దీ ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి. అందుకే మొదట రెండెకరాలు.. ఆపై నెమ్మదిగా మొత్తం భూమిలో పాగా వేయాలనే ‘బిగ్’ స్కెచ్. రెవెన్యూ అధికారులు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నరు. ఇదేమంటే మూడు రోజుల కిం దనే రేకులు తొలగించాం కదా! అంటున్నరు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. మొక్కుబడిగా ముందుభాగంలో కొన్ని రేకు లు తొలగించినట్టు చేసి.. ఇప్పుడు దానినీ పునరుద్ధరిస్తున్నారు. బిగ్ బ్రదర్స్ టేకప్ చేసిన ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలోని సర్వే నంబర్ 41 భూముల కథ అంతులేనిది. వాస్తవానికి ఈ సర్వే నంబర్లో 252.24 ఎకరాల భూమి ఉన్నది. ఖాస్రా పహాణీ లో పోరంబోకు సర్కారీగా నమోదై ఉన్నది. 1962-63 ప్రాంతంలో ఇందులో 13మంది నిరుపేదలకు సాగు కోసం భూపంపిణీ చేశారు. ఒక్కొక్కరికీ 2 ఎకరాలు మొదలు 5, 8 ఎకరాల ఇచ్చారు. ఇలా 13మందికి మొత్తం 47 ఎకరాలు ఇచ్చారు. తదనంతర రికార్డుల్లో అసైనీల పేర్లు న మోదు కావాల్సి ఉన్నందున సబ్ డివిజన్లు వచ్చా యి. 41/1 నుంచి 41/13 వరకు 47 ఎకరాల మేర అసైనీల పేర్లు వస్తున్నాయి. 41/14లో మిగిలిన 205.24 ఎకరాలు మాత్రం సర్కార్ భూమిగానే ఉన్నది.
కాలక్రమేణా ఐటీ కారిడార్ రావడం తో ఈ భూములకు డిమాండ్ భారీగా పెరిగింది. అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు జరుపొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలోనే బడాబాబులు భారీ ఎత్తున 47 ఎకరాల అసైన్డ్ భూములను చెరపడుతూ వస్తున్నారు. కొన్నిచోట్ల ఒకే భూ మిని అనేకమంది కొనుగోలు చేయడంతో ఇందు లో అనేక కోర్టు కేసులు ఉన్నాయి. చివరికి కొందరు నకిలీ సప్లిమెంటరీ సేత్వార్‌ను సృష్టించి న్యాయస్థానాలను మోసం చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఈ మేరకు 2018లో కలెక్టర్‌గా ఉన్న లోకేశ్‌కుమార్ ఈ నకిలీ సప్లిమెంటరీ సేత్వార్ల గుట్టు కూడా విప్పారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ న్యాయస్థానాలకు ఇచ్చిన అఫిడవిట్లో ఈ వాస్తవాలనూ కోర్టు ముందుంచారు.
సర్వేనంబర్ 41/14లో పూర్తిగా ప్రభుత్వ భూమిగానే వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఇందులోని భూములను హెచ్ఎండీఏ ద్వారా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌సంస్థలకు అప్పటి ప్రభుత్వాలు కేటాయింపు లు చేశాయి. 2009లో ఫార్చూన్ హైట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు 2.30 ఎకరాలు, 2010లో ఉమక్ రిసార్ట్స్‌కు ఐదెకరాలు, హాస్పిటాలిటీ ఈస్టర్న్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నాలుగెకరాలు, మారుతీ సుజుకి కంపెనీకి రెండెకరాలు, అలెగ్జాండ్రియాకు ఐదెకరా లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్కు 20 ఎకరాలు, రహదారులకు మరో నాలుగెకరాలు ఇలా మొత్తం దాదాపు 43 ఎకరాల వరకు కేటాయింపులు జరిగాయి.
మిగతా భూమిని ఏపీఐఐసీ, హెచ్ఎండీఏలకు కేటాయించగా రెండు సంస్థ లు ఆ భూముల్లో కొంత లేఅవుట్ చేసి ల్యాండ్ పార్సిల్స్‌ను వేలం ద్వారా విక్రయించాయి. ఇలా వేలం వేయగా మిగిలిన భూమిని ప్రభుత్వం స్వాధీ నం చేసుకున్నది. ఈ మేరకు హెచ్ఎండీఏ నుంచి 62.24 ఎకరాలు, టీఎస్ఐఐసీ నుంచి 63.20 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని 2016లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత టీజీఐఐసీకి అప్పగించి అందులో లేఅవుట్ ద్వారా ప్లాట్లను విక్రయించేందుకు అనుమతినిచ్చింది. ఆ మేరకు టీజీఐఐసీకి కొన్ని ప్లాట్లను విక్రయించగా.. చాలా వరకు మిగిలి ఉన్నాయి. ఇలా హెచ్ఎండీఏ, టీజీఐఐసీకి ఇచ్చి తిరిగి స్వాధీనం చేసుకున్న భూము లు సాంకేతికంగా రెవెన్యూ ఆధీనంలో ఉన్నాయి. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం వాటిని గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సర్వే నంబర్ 41/1 నుంచి 41/13 వరకు అనేక వివాదాలుండగా.. తరచూ ఒకే భూమిపైకి ఇద్దరు రావడం తద్వారా శాంతిభద్రతల సమస్య తలెత్తడం ఇక్కడ సహజంగా మారింది. తాజాగా బిగ్ బ్రదర్స్ కన్ను వీటిపై పడినట్టు తెలుస్తున్నది. ఫక్తు ప్రభుత్వ భూమిగా వస్తున్న 41/14 సబ్ డివిజన్లోని భూమిపై గురిపెట్టారు. కొందరు వ్యక్తులు ఇటీవల అందులో రెండెకరాల మేర భూమిని ఆధీనంలోకి తీసుకొని చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మించారు. పదుల సంఖ్యలో అక్కడ ప్రైవేట్ వ్యక్తుల్ని మోహరించారు. ముఖ్యంగా బిగ్ బ్రదర్ అనుచరు డి ఆధ్వర్యంలో ఈ కబ్జాపర్వం నడుస్తున్నట్టు సమాచారం.
దీనిపై కొందరు ఆరా తీయగా.. 41/13కి సంబంధించిన డాక్యుమెంట్లు చూపి, 41/14లో పాగా వేసినట్టు తెలుస్తున్నది. దీనిపై రెవెన్యూ శాఖ కు ఫిర్యాదులు వెళ్లడంతో నామమాత్రంగా చర్యలు తీసుకొని, ఆపై చేతులెత్తేసినట్టు స్పష్టమవుతున్నది. సదరు ప్రైవేట్ వ్యక్తులు వేసిన రేకుల్ని ముందువైపు తొలగించారు. ఈ నేపథ్యంలో సోమవారం రెవెన్యూ అధికారులను సంప్రదించగా.. మూడు రోజుల కిందటనే రేకులను తొలగించినట్టు చెప్పారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. వెనుక వైపు రేకుల ప్రహరీ అట్లనే ఉండగా.. ముందువైపు తీసేసిన రేకులను తిరిగి పునరుద్ధరించేందుకు ఫ్రేమ్స్‌ను బిగిస్తున్నారు.