420 వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిని పూర్తిగా విస్మరించి ఇబ్బందులు పెడుతున్నదని ప్రజలు మండిపడుతున్నారు. పలు సమస్యలు ప్రస్తావిస్తూ ఆందోళన బాట పడుతున్నారు. గ్రామాభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని సర్పంచులు, మద్యం విక్రయాలను నిరసిస్తూ గ్రామస్తులు, ఇందిరమ్మ ఇంటి బిల్లు హోల్డ్‌లో పెట్టారని దంపతులు, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గిరిజనులు, సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు.
‘ఎన్నికల సమయంలో తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చా.. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఏమీ చేయలేక పోతున్నా.. మీరైనా సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి సహకరించండి’ అంటూ కలెక్టర్ రిజ్వాన్బాషాను బీరెల్లి కాంగ్రెస్ సర్పంచ్ గౌని కవిత వేడుకున్నది. జోగుళాంబ గద్వాలలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో సమస్యలను విన్నవించారు.
-గద్వాల

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ సర్పంచులు, నాయకులు ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. మండల సర్వసభ్య సమావేశానికి విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌తో రాగా.. అడ్డుకున్నారు.
-హన్వాడ

ఇందిరమ్మ ఇంటి స్లాబ్ నిర్మాణం పూర్తయినా బిల్లు హోల్డ్‌లో పెట్టడంపై రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బావూసింగ్తండా పరిధి గోన్యానాయక్ తండాకు చెందిన
బట్టు రోజా మాన్య దంపతులు పురుగులమందు డబ్బాతో సోమవారం ప్రజావాణికి వచ్చి నిరసన తెలిపారు.
– వీర్నపల్లి

బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలను నిషేధిస్తూ తీర్మానించినప్పటికీ ఎక్సైజ్ అధికారుల అండదండలతో యథేచ్ఛగా మద్య విక్రయాలు కొనసాగుతున్నాయని మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం ఆస్నాద్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల తీరును నిరసిస్తూ సోమవారం గ్రామంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ తీశారు.
– చెన్నూర్ రూరల్

అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ధర్నా నిర్వహించారు.
– కొత్తగూడెం గణేశ్‌టెంపుల్

ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం
కలెక్టరేట్ ఎదుట సోమవారం భారీ ధర్నా నిర్వహించారు.
– కొత్తగూడెం గణేశ్‌టెంపుల్