దుబాయ్: పదిహేనేండ్లకే అంతర్జాతీయ అరంగేట్రం చేసి రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తనదైన ముద్ర వేసేందుకు వేట ఆరంభించాడు. జింబాబ్వేతో సిరీస్‌లో (151 రన్స్) నిలకడగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ఈ చిన్నోడు టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి 48వ స్థానంతో టాప్-50లో అడుగుపెట్టాడు. టీ20ల్లో ఇషాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక వన్డేల్లో భారత సారథి శుభ్‌మన్ గిల్ 801 రేటింగ్ పాయింట్లతో డారిల్ మిచెల్ (న్యూజిలాండ్)ను వెనక్కినెట్టి తిరిగి నంబర్ వన్ స్థానానికి చేరాడు.
ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా బుడ్డోడు..
వచ్చే నెలలో జరిగే దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్‌కు వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈ జట్టులో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్ వంటి స్టార్ ప్లేయర్లున్నారు. దులీప్ ట్రోఫీలో ఆడటం వైభవ్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.