Shri Gundicha Temple : ఒడిశాలోని ప్రఖ్యాత శ్రీ గుండిచా దేవాలయం ఆరేళ్ల తర్వాత తెరుచుకుంది. కోవిడ్ సమయంలో మూతబడిన ఈ దేవాలయం ఇన్నాళ్లకు తెరుచుకోవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది స్తానికంగా చాలా ప్రఖ్యాతి చెందిన దేవాలయం. కారణం.. ఇది జగన్నాథుడి జన్మ స్థలం అని భావిస్తారు. దీన్ని జన్మవేది అని కూడా పిలుస్తారు. 2020లో వచ్చిన కోవిడ్ సమయంలో దీన్ని మూసేశారు.
మళ్లీ ఇన్నాళ్లకు, బుధవారం ఈ దేవాలయం అందుబాటులోకి రావడంపై భక్తులు, సేవకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాన్ని ప్రారంభించే ముందు ఆలయం లోపల అర్చకులు ప్రత్యేక పూజలు, ధార్మిక సేవలు నిర్వహించారు. అనంతరం బుధవారం ఉదయం 7.45 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. శ్రీ గుండిచా అని పిలిచే ఈ దేవాలయంలో పూరీ జగన్నాథుడిని జన్మవేదిగా భావిస్తూ, భక్తులు దర్శించుకుంటారు. మొదటి రోజు కావడంతో భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చారు. దీంతో దేవాలయం, ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
పూరీలోని జగన్నాథుడిని దర్శించుకునే భక్తులు.. శ్రీ గుండిచా ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. అత్యంత పవిత్రంగా భావించే ఈ దేవాలయంలోకి భక్తుల్ని సింగ్ ద్వారం గుండా అనుమతిస్తున్నారు. మొదటి మూడు రోజులు ఉచితంగానే దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత నుంచి రూ.10 ఎంట్రీ టిక్కెట్‌తో దర్శనానికి అనుమతిస్తారు. మరోవైపు ఆలయం ప్రాంగణంలో, బయట భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. తనిఖీల తర్వాతే భక్తుల్ని ఆలయంలోకి అనుమతిస్తున్నారు.