సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. రూ. 1400కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా కమిషనర్ ఇలంబర్తి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ కమిషనర్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయామని, తీవ్ర ఆర్థిక ఒత్తిడితో నలుగురు కాంట్రాక్టర్లు చనిపోయారని కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ స్పందించి బిల్లులు విడుదల చేయాలని, లేదంటే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 3వేల మంది కాంట్రాక్టర్లు చేస్తున్న పనులను నిలిపివేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.